- కాసీపేట-1ఏ బొగ్గు గని ప్రారంభించిన జీఎం
- రోజుకు 500 టన్నులు బొగ్గు ఉత్పత్తి
- గనిలో 400 మంది ఉద్యోగులకు ఛాన్స్
కోల్‌బెల్ట్, వెలుగు:మందమర్రి ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసీపేట1 ఏ బొగ్గు గనిని(టన్నెల్) ఏరియా సింగరేణి జీఎం జి.మోహన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రస్తుతం నడుస్తున్న కాసీపేట1 గనిలో బొగ్గు వెలికితీత దూరం కావడంతో 2.5 కి.మీ దూరంలో కొత్తగా టన్నెల్ ద్వారా కాసీపేట1ఏ గనిని అందుబాటులోకి తీసుకవచ్చారు. రూ.24.39 కోట్ల వ్యయంతో చేపట్టిన కాసీపేట1ఏ గని కోసం డిసెంబర్ 6న పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన గని లో 400 మంది ఉద్యోగులు పనిచేయనుండగా రోజుకు సుమారు 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఏడాదికి లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి యాజమాన్యం టార్గెట్ పెట్టుకుంది. సెమీ మెకానైజేషన్ ద్వారా మూడు ఎస్డీఎల్ యంత్రాల సహయంతో బొగ్గును ఉత్పత్తి చేయనున్నారు. ఏరియాలో మూతపడనున్న ఆర్కే1ఏ, కేకే1 గనులకు సంబంధించిన కార్మికులను కాసీపేట1ఏ టన్నెల్లో సర్దుబాటు చేయనున్నారు. కొత్తగా టన్నెల్ అందుబాటులోకి తీసుకరావడం పట్ల కార్మికుల్లో సంతోషం వ్యక్తమైంది.
కొత్త టన్నెల్ వల్ల దూరభారం తగ్గుతుంది…
కాసీపేట1 గనికి అనుబంధంగా కొత్తగా అందుబాటులోకి తీసుకవచ్చిన కాసీపేట1ఏ టన్నెల్ వల్ల ఉద్యోగులకు దూరభారం తగ్గుతుందని ఏరియా జీఎం మోహన్‌రెడ్డి తెలిపారు. గనిలో ఉత్పత్తి అయిన బొగ్గును రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ ద్వారా కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ)కి రవాణా చేస్తామన్నారు. అంతకు ముందు కాసీపేట1ఏ టన్నెల్‌కు సంబంధించిన 150హెచ్‌పీ సర్పేస్ హాలర్, పవర్ ట్రిఫ్లర్, 1000కేవీ సబ్ స్టేషన్లను జీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో ఏరియా ఏస్వోటుజీఎం ఎ.రాజేశ్వర్‌రెడ్డి, కాసీపేట గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, గని మేనేజర్ అల్లావుద్ధీన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎం.రవిందర్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏజీఎం నాగరాజు, గని సేఫ్టీ ఆఫీసర్ సునీల్ కుమార్, డిప్యూటీ మేనేజర్ వెంకటేశ్, గని సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జిషాన్, కార్మిక సంఘాల లీడర్లు పాల్గొన్నారు.