
కోల్ బెల్ట్,వెలుగు: కాగితపు రహిత ఉత్తర, ప్రత్యుత్తరాల సేవలను అమల్లోకి తీసుకువస్తుందని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ఏరియా ఆఫీసర్లకు గోలేటీలోని జీఎం ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఐటీ విభాగం ఆధ్వర్యంలో శాప్ ఫైల్ లైఫ్ సైకిల్ పై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్‌గా హాజరైన జీఎం మాట్లాడుతూ.. సింగరేణిలో టెక్నాలజీని అందిపుచ్చుకొని మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణ హిత చర్యల్లో భాగంగా కాగితాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించే శాప్ ఫైల్, లైఫ్ సైకిల్ పై మరింత అవగాహన ఉండాలన్నారు. ఏప్రిల్ నుంచి సింగరేణి వ్యాప్తంగా పేపర్ లెస్ ప్రక్రియ అమలు కానుందన్నారు. ప్రపంచంలోని పలు రంగాలు, పరిశ్రమలు సాంకేతికతను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి దిశగా దూసుకు పోతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేట్ ఐటీ ఆఫీసర్లు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏరియా ఏస్వోటుజీఎం కె.రాజమల్లు, పీవో ఎం.నరేందర్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ఐటీ ఇన్ చార్జీ ముజీబ్, కార్పొరేట్ ఐటీ ఆఫీసర్లు హరప్రసాద్, కిరణ్‌కుమార్, శంకర్, రమ్య పాల్గొన్నారు.