ఆదిలాబాద్ జిల్లా మెడికల్​ టాస్క్​ఫోర్స్​ టీమ్​ ఏర్పాటు

 ఆదిలాబాద్ జిల్లా మెడికల్​ టాస్క్​ఫోర్స్​ టీమ్​ ఏర్పాటు

మంచిర్యాల, వెలుగు: ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా మెడికల్​ టాస్క్​ఫోర్స్​ టీమ్​ను ఏర్పాటు చేశామని టీజీఎంసీ మెంబర్​ డాక్టర్​ యెగ్గెన శ్రీనివాస్​ తెలిపారు. ఈ టీమ్​లో 30 మంది డాక్టర్లను సభ్యులుగా నియమించామన్నారు. శుక్రవారం పాత మంచిర్యాలలోని ఐఎంఏ హాల్​లో జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ రమణ, జనరల్​ సెక్రటరీ డాక్టర్​ విశ్వేశ్వర్​రావు, ట్రెజరర్​ డాక్టర్​ స్వరూపారాణితో పాటు టీమ్​ మెంబర్స్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. కమీషన్లు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్న నకిలీ డాక్టర్లు, వారికి సహకరిస్తున్న హాస్పిటల్స్​ పైన, అటువంటి హాస్పిటల్స్​కు సహకరిస్తున్న డాక్టర్ల పైన టాస్క్​ఫోర్స్​ టీమ్​ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

 వైద్యవృత్తి విలువలు, ప్రజల్లో నమ్మకం పెంచడానికి కృషి చేస్తుందన్నారు. టీమ్​లో ప్రజారోగ్యంపై అవగాహన, శ్రద్ధ ఉన్న ఆర్గనైజేషన్స్​, అడ్వకేట్లు, పోలీసులు, జర్నలిస్టులు, ఎన్​జీవోల ప్రతినిధులు, పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు, డ్రగ్​ ఇన్స్​పెక్టర్​లను భాగస్వాములు చేస్తామని చెప్పారు. అనైతికంగా వ్యవహరిస్తున్న డాక్టర్లకు, హాస్పిటల్స్​కు ఐఎంఏ నుంచి ఎలాంటి సహకారం ఉండదని ప్రెసిడెంట్​ రమణ అన్నారు. ప్రజలకు వైద్యపరమైన ఇబ్బందులు, కమీషన్ల కోసం వేధింపులు, నకిలీ డాక్టర్లు, అంబులెన్స్​లు తప్పుదారి పట్టిస్తే హెల్ప్​లైన్​ 7557555777 నంబర్​కు వాట్సాప్​ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సీనియర్​ డాక్టర్లు చంద్రదత్​, మల్లేశ్​, సాల్మన్​రాజు, గోలి పూర్ణచందర్​, అన్నపూర్ణ, అలివేణి పాల్గొన్నారు.