
సమీకరిస్తున్న జీఎమ్ఆర్
హైదరాబాద్,వెలుగు : జీఎమ్ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐ-ఏఎల్) బాండ్స్ జారీ ద్వారా సుమారు రూ.2,071 కోట్లను సమీకరిస్తోంది. జీఎమ్ ఆర్ గ్రూప్‌కు చెందిన జీహెచ్ఐఏఎల్ అంతర్జాతీయ మార్కెట్లో ఐదేళ్ల కాలపరిమితి గల బాండ్లకు 5.375 శాతం వార్షిక వడ్డీరేటును నిర్ణయించింది. ఏప్రిల్ 3న ఈ ఆఫరింగ్‌ను ప్రారంభించినట్లు జీహెచ్ఐఏఎల్ తెలిపింది. దీని ద్వారా సమీకరించిన నిధులను హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌ను విస్తరించడానికి వినియోగించుకోనున్నట్లు వెల్లడించింది. విమానాశ్రయ సామర్థ్యాన్ని ఏటా 3.4 కోట్ల ప్రయాణికులకు పెంచడానికి కూడా ఈ నిధులను ఉపయోగించుంటారు. బాండ్ల జారీని విజయవంతంగా పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని, ఈ ఆఫర్ అంతర్జాతీయ బాండ్ మార్కెట్ల నుండి నిధుల సేకరణ తమ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని జీఎమ్ఆర్ గ్రూప్ కార్పోరేట్ చైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్ తెలిపారు. తమ ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చడానికి, అభివృధ్ధి కోసం నిధులను సేకరిం చడానికి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమని అన్నారు .ఈ ఆఫర్ విజయవంతం కావడం జీఎమ్ఆర్ గ్రూప్‌పై ఇన్వెస్టర్లకున్న నమ్మకాన్ని, జీహెచ్ఐఏఎల్ రుణ సమీకరణ సామర్థ్యాన్ని తెలియజేస్తుందని చెప్పారు.