
న్యూఢిల్లీ: భారతదేశ 26వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ బుధవారం (ఫిబ్రవరి 19) బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయంలో చార్జ్ తీసుకున్న జ్ఞానేష్ కుమార్.. ఈ సందర్భంగా దేశ ఓటర్లకు కీలక సందేశమిచ్చారు. దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటు వేయడమేనని..18 ఏళ్లు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటరుగా మారాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఎల్లప్పుడు ఓటు వేయాలని సూచించారు. "జాతి నిర్మాణంలో తొలి అడుగు ఓటు వేయడం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా మారాలి. ఎల్లప్పుడూ ఓటు వేయాలి. భారత రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, నియమాలకు అనుగుణంగా భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడు ఓటర్లతోనే ఉంటుంది’’ అని మేసేజ్ ఇచ్చారు.
కాగా, మాజీ సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం 2025, ఫిబ్రవరి 18తో ముగియడంతో అతడి స్థానంలో తదుపరి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను నియమించింది ప్రధాని మోడీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్. సెలక్షన్ కమిటీ సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో జ్ఞానేష్ కుమార్ ఎంపికకు లైన్ క్లియర్ అయ్యింది.
ALSO READ | ‘రూ.5 కోట్లు ఇస్తే మంత్రి పదవి’.. కేంద్రమంత్రి కొడుకు పేరుతో బీజేపీ ఎమ్మెల్యేలకు ఆఫర్
అయితే.. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి సీజేఐను తప్పించడంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై 2025, ఫిబ్రవరి 19న దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. మరికొద్ది సేపట్లో ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఈసీగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఎలక్షన్ కమిషన్ ప్రధాన కమిషనర్, కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సీజేఐను తొలగించడంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
జ్ఞానేష్ కుమార్ ఎవరు..?
1988 బ్యాచ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన కుమార్, ఆగస్టు 2019లో జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఆయన హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ (కాశ్మీర్ డివిజన్)గా పనిచేశారు. 2020లో హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేసిన జ్ఞానేష్ కుమార్.. అయోధ్యలోని రామమందిరంపై సుప్రీంకోర్టు కేసుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను పర్యవేక్షించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటుకు దోహదపడిన పత్రాల నిర్వహణలో ఆయన కీలకంగా పని చేశారు.