- వరదలతో కాలనీల్లోకి చేరిన చెత్త, బురద
- ఏటా రూ. 2 కోట్లు ఖర్చు చేస్తున్నా కనిపించని ఫాగింగ్ మెషీన్లు
- వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ బారిన ప్రజలు
- కేసులు దాచేస్తున్న ఆఫీసర్లు
వరంగల్, వెలుగు : ఇటీవల భారీ వర్షాలు పడడం, వరదల ప్రభావంతో గ్రేటర్ వరంగల్‌లోని పలు కాలనీలు చెత్త, చెదారంతో నిండిపోయాయి. దీంతో దోమలు విజృంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది వైరల్ ఫీవర్స్, మలేరియా, డెంగీతో ఎంజీఎం, ప్రైవేట్ హాస్పిటల్స్ బాట పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు, ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వ ఉండడం దోమల వ్యాప్తికి కారణం అవుతోంది. దోమలు పెరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాలనీల్లో రెగ్యులర్‌గా ఫాగింగ్, దోమల మందు స్ప్రే చేయాల్సి ఉన్నప్పటికీ బల్దియా సిబ్బంది పట్టించుకోవడం లేదు.
175 మంది సిబ్బంది.. ఏటా రూ.2 కోట్లు
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో దోమల నివారణకు రెగ్యులర్, కాంట్రాక్ట్ కలిపి మొత్తం 175 మంది పనిచేస్తున్నారు. ఫాగింగ్ మిషన్లు, ఆటోలు, డీజిల్, పెట్రోల్, జీతాల పేరుతో ఏటా రూ.2 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. మున్సిపల్ హెల్త్ విభాగంలో గతంలో 36 మెషీన్లు ఉండగా ఏడు నెలల క్రితం మరో 18 మెషీన్లు తెప్పించారు. ఫాగింగ్ చేసే చిన్న మెషీన్లకు ప్రతి రోజు 5 లీటర్ల డీజిల్, లీటర్ పెట్రోల్, ఆటోలకు 75 లీటర్ల డీజిల్, 10 లీటర్ల పెట్రోల్ ఇస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. కానీ ఇదంతా పేపర్‌పైనే చూపుతూ, ఫీల్డ్ లెవల్‌లో మాత్రం ఖర్చు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీజిల్, పెట్రోల్, ఆయిల్ బాల్స్ విషయంలో సిబ్బంది చేతివాటం చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఏరియాలో కనీసం వారానికి ఒకసారైనా దోమల మందు స్ప్రే, ఫాగింగ్ చేయాల్సి ఉండగా రెండు, మూడు వారాలైనా సిబ్బంది రావడం లేదని కాలనీవాసులు మండిపడుతున్నారు.
మురుగు నీటి గుంతలుగా ఖాళీ ప్లాట్లు
గ్రేటర్ వరంగల్‌లోని 66 డివిజన్లలో 42 విలీన గ్రామాలు కలిపి మొత్తం 1,450 కాలనీలు ఉండగా, 12 లక్షల మంది నివసిస్తున్నారు. ఇందులో వరంగల్, హనుమకొండ పరిధిలో 183 వరకు స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఆయా ఏరియాల్లో సుమారు 2 లక్షల మంది వరకు ఉంటున్నారు. మురుగు కాల్వలు, నాలాలు, అభివృద్ధి పనుల కోసం తవ్వి వదిలేసిన గుంతలతో పాటు ఇండ్ల మధ్య ఉన్న సుమారు 2,500 ఖాళీ ప్లాట్లు దోమలకు కేరాఫ్‌గా మారాయి. గతంలో ఆఫీసర్లు వర్షాకాలానికి ముందే ఖాళీ ప్లాట్ల ఓనర్లకు నోటీసులు ఇచ్చి పిచ్చి మొక్కలు పెరగకుండా, మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకునేవారు. కానీ ఈ సారి బల్దియా ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్ల ఖాళీ ప్లాట్లు మురుగు నీటి గుంతలుగా కనిపిస్తున్నాయి.
రికార్డుల్లోకి ఎక్కని కేసులు
వరంగల్‍ఎంజీఎంలో సాధారణ రోజుల్లో 1,400 లోపు ఉండే ఓపీ ప్రస్తుతం వైరల్ ఫీవర్స్, మలేరియా, చికున్ గున్యా, డెంగీ బాధితుల రాకతో 2,500 దాటుతోంది. ఇందులో సుమారు 1000 మంది దోమల కారణంగా విషజ్వరాల బారిన పడిన వారే అని సమాచారం. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న వారిలో 10 నుంచి 15 శాతం మందే ఎంజీఎంకు వస్తుండగా, మిగతా వారంతా ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు హనుమకొండ జిల్లాలో 7 మలేరియా, 28 డెంగీ కేసులు, వరంగల్ జిల్లాలో 4 మలేరియా, 38 డెంగీ కేసులు నమోదైనట్లు ఆఫీసర్లు రికార్డుల్లో నమోదు చేశారు. గ్రేటర్ సిటీ పరిధిలో అసలు కేసులే లేవని పేర్కొన్నారు. కానీ వాస్తవంగా మలేరియా, డెంగీ కేసుల సంఖ్య భారీగా ఉన్నప్పటికీ ఆఫీసర్లు నమోదు చేయడం లేదని పలువురు అంటున్నారు. ఫీల్డ్ విజిట్‌తో పాటు హస్పిటల్స్‌లో బాధితుల సంఖ్య ఆధారంగా కలెక్టర్లు, గ్రేటర్ కమిషనర్ చర్యలు చేపట్టాల్సి ఉండగా, కింది స్థాయి సిబ్బంది రివ్యూలతోనే సరిపెడుతున్నారు.
ఫాగింగ్ చేసేటోళ్లు రావట్లే...
మా కాలనీలో దోమల బెడద ఎక్కువైంది. వీటి బారిన పడి గతేడాది ఇంటికి ఒకరిద్దరు పేషెంట్లు అయిన్రు. ఇలాంటి చోట ఫాగింగ్ చేయడానికి ఎవరూ రావడం లేదు. స్ప్రే చల్లేందుకు వచ్చే సిబ్బంది సైతం ఇప్పుడు ఇటు వైపుగా రావట్లేదు. అధికారులకు ఫోన్ చేసినా ఫలితం లేదు.
- ఎం.రాజు, సుందరయ్యనగర్, హన్మకొండ