జీవో 111 ఎందుకు? ఏమిటి? ఎలా?

అభివృద్ధి వేగవంతమైతే ప్రకృతికి నష్టం ఏదోక విధంగా తప్పదు. ఈ రెండింటి మధ్య నిత్యం తగాదా సాగుతూ ఉంటుంది . ఎంత జాగ్రత్తగా బ్యాలెన్స్‌ చేస్తామన్న అంశంపైనే ఆ ప్రాంత మనుగడ ఆధారపడి ఉంటుంది . ఈ బ్యాలెన్సింగ్‌ యాక్ట్‌ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వం తన
బాధ్యతను సరిగ్గా నెరవేర్చనట్టయితే సమాజమే మేలుకొంటుంది . మంచి చెడులు తేలుస్తుంది . జీవో 111 విషయంలో ఇదే జరుగుతోంది.

హైదరాబాద్‌కు వరదలు రాకుండా వందేళ్ల క్రితం మూసీ నదిపై ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌ అని రెండు రిజర్వాయర్లు కట్టారు. ఈ ‘జంట జలాశయాలు’ అప్పట్లో సుమారు పది లక్షల జనాభాకి మంచినీళ్లు అందించేవి. ప్రస్తుతం రెండు లక్షల మందికే ఈ నీళ్లను సప్లయి చేస్తున్నారు. నగరం నానాటికీ విస్తరిస్తున్న క్రమంలో ఈ రిజర్వాయర్లకు ప్రమాదం ఏర్పడింది. వీటి చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించింది. కాంక్రీట్​ నిర్మాణాలు వెలిశాయి. వీటివల్ల క్యాచ్‌మెంట్‌ ఏరియా డేంజర్​లో పడింది. సహజ సిద్ధంగా రిజర్వాయర్లకు వచ్చే నీటికి అడ్డుకట్ట పడింది. ఫీడర్‌ ఛానెల్స్‌ మూసుకుపోయాయి. నిర్మాణాలకు అనుమతులు ఆపనట్లయితే జంట జలాశయాలు కనుమరుగైపోతాయనే ఆందోళన నుంచి జీవో 111 పుట్టింది.

ఈ జలాశయాల పరిధిలో నిర్మాణాలు పెరగడం, పరిశ్రమలు వెలిసే అవకాశాలు ఉండడంతో కొందరు కన్‌సర్న్‌డ్‌ సిటిజెన్స్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్టేట్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు కూడా అందులో భాగస్వామి అయ్యింది. సుప్రీం కోర్టు వీరికి అనుకూలంగా తీర్పునిస్తూ జలాశయాలను కాపాడే చర్యలు చేపట్టమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో 1996లో నాటి ప్రభుత్వం జీవో 111ని జారీ చేసింది. దీని ప్రకారం జంట జలాశయాల ఫుల్‌ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే రూల్​ ఉంది. అయితే ఒక మినహాయింపు ఉంది. ఒక స్థలంలో 10శాతం మేరకు, కేవలం నివాసం కోసం మాత్రమే కనస్ట్రక్షన్​ చేసుకోవచ్చు. కానీ, జీ ప్లస్‌ 2 (మొత్తంగా మూడంతస్తులు)కి మించకూడదు. ఫీడర్‌ ఛానళ్లకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా నిబంధనల మేరకే కనస్ట్రక్షన్‌ ఉండాలి. జీవో 111 జంట జలాశయాల పరిధిలోని ఆరు మండలాలకు (శంషాబాద్‌, మొయినాబాద్‌, షాబాద్‌, శంకరపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల) వర్తిస్తుంది. ఈ మండలాల పరిధిలో 84 గ్రామాలు ఉన్నాయి.

రియల్​ ఎస్టేట్​ బూమ్​తో తూట్లు

రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ వచ్చిన నాటి నుంచి ఈ ఆరు మండలాల్లోని గ్రామాల పరిధిలో విపరీతంగా భూ ముల అమ్మకం మొదలైంది. ఇంకా చెప్పాలంటే… ఓఆర్‌ఆర్‌ (ఔటర్‌ రింగ్‌ రోడ్డు) ప్రపోజల్​ రాగానే భూముల కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, ఐటీ సిటీ పేర్ల మీదుగా లెక్కలేనన్ని వెంచర్లు వెలిశాయి. 2007–08 కాలంలోని రియల్‌ బూమ్‌లో చిన్న చిన్న ప్లాట్లతో వెంచర్లు ఏర్పడడంతో మిడిల్​ క్లాస్​ జనాలు పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు భారీ ఫామ్‌ హౌస్​లు, ఇంజనీరింగ్‌ కాలేజీలు, గేటెడ్​ కమ్యూనిటీలు, రియల్‌ వెంచర్లు పెరిగిపోయాయి. జీవో 111 అమలు కాకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ ఫీడర్​ చానల్స్​ మూసేయడంతో జంట జలాశయాలకు నీరే అందకుండా పోయింది. క్యాచ్‌మెంట్‌ ఏరియా పూర్తిగా మాయమైంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో సైతం జంట జలాశయాల్లోకి చుక్క నీరు చేరలేదు. దీనిపై అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై మళ్లీ కొందరు పర్యావరణవేత్తలు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు రాష్ట్ర ప్రభుత్వ స్పందనను కోరింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఒక సర్క్యులర్‌ జారీ చేసి… జీవో 111 పరిధిలో అక్రమ నిర్మాణాలు రాకుండా చూడాలని హెచ్‌ఎండీఏని ఆదేశించింది. హెచ్‌ఎండీఏ ఆ బాధ్యతను పంచాయితీలపై మోపింది. వాళ్లు ఫెయిల్‌ అయితేనే హెచ్‌ఎండీఏ జోక్యం చేసుకుంటుంది. మొత్తం మీద రకరకాల రూల్స్​, రెగ్యులేషన్స్​ ఉన్నప్పటికీ జంట జలాశయాల పరిరక్షణ ఒక ప్రహసనంగానే కొనసాగుతోంది. 2016లో హెచ్‌ఎండీఏ చేసిన ఒక సర్వే ప్రకారం జీవో 111 పరిధిలో12,500 అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 3,000 వరకు ఫామ్‌హౌస్​లు ఉంటాయని అంచనా. ఇంజనీరింగ్‌ కాలేజీలు 50 వరకు ఉన్నాయి. జీవో పరిధిలోని గ్రామాల్లో  కొత్తగా పుట్టుకొస్తున్న కాలనీల్లో కొన్ని వేల సంఖ్యలో నిర్మాణాలు ఉంటాయి. జీప్లస్‌ టూ నిబంధనకు తూట్లు పొడుస్తూ పది, ఆపై అంతస్తులతో కట్టిన భవనాలు ఈ ప్రాంతంలో ఎన్నో కనిపిస్తాయి. పంచాయితీ, హెచ్‌ఎండీఏ అధికారులు కొన్ని ఇల్లీగల్​ కనస్ట్రక్షన్లను కూలుస్తున్నా కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయని వారే అంగీకరిస్తున్నారు.

జీవో రద్దు కోసం ఒకవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే, హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై కోర్టులో విచారణ కొనసాగుతూ ఉంది. మొత్తంమీద నగర విస్తరణ జంట జలాశయాలకు ప్రమాదకరంగా మారిందని అందరికీ అర్థమవుతోంది. జీవో రద్దును పర్యావరణవేత్తలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. జంట జలాశయాలకు సమాధి కట్టినట్టు అవుతుందని హెచ్చరిస్తున్నారు.

– పి. శశికాంత్​

హైదరాబాద్ కి దాహం తీర్చాయి నదీ తీరాల వెంటే నగరాలు వెలిసిన క్రమంలోనే హైదరాబాద్‌ కూడా మూసీ తీరాన అవతరించింది. అయితే మూసీకి తరచుగా భారీ వరదలు వచ్చేవి. ఈ క్రమంలో 1908 సెప్టెం బర్‌ 28 మూసీకి భారీ వరదలు వచ్చాయి. 17 ఇంచులు వాన ఆ రోజు పడింది. అప్ఘల్‌గంజ్‌ వద్ద 11 ఫీట్ల ఎత్తులో నీరు ప్రవహించింది. పదిహేను వేల మంది చనిపోయారు. ఈ ప్రళయం చూసి చలించిన నిజాంరాజు భవిష్యత్తులో వరదల్ని నివారించేందుకు ఏం చేయాలో సూచించమని ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుమేరకు ఇంజనీర్‌ సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రంగంలోకి దిగి మూసీకి ఎగువన రెండు ఆనకట్టలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు 1920లో మూసీపై ఉస్మాన్ సాగర్‌,
1927లో ఈసీ నదిపై హిమాయత్ సాగర్‌ నిర్మించారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీకి ఈసీ ఉపనది. ఈ రెండు రిజర్వాయర్ల వల్ల హైదరాబాద్ వరద ప్రమాదం తప్పడంతోపాటు… ప్రజల దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతూ వస్తున్నాయి.

నీళ్లు లేవన్న సాకుతో…
ఇదిలా ఉండగానే మరోవైపు జీవో 111 ఎత్తి వేయాలనే డిమాండ్‌ కూడా ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో పెరుగు తున్న జనాభా అవసరాలకు ఈ జంట జలాశయాలు సరిపోవడం లేదు. మంజీరా, సింగూరు నీళ్లపై కొద్ది రోజులు ఆధారపడ్డారు . వాటిల్లోనూ నీళ్లు అడుగంటిపోయేసరికి గోదావరీ, కృష్టా నదులపై దృష్టి పెట్టా రు. ప్రస్తుతం నగరానికి ప్రధా- నంగా నీరందిస్తున్న నదులు ఇవే. ఈ నేపథ్యం లో
మంచి నీళ్లకోసం ఉ స్మాన్ సాగర్‌, హిమాయత్ సాగర్‌ల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని, అలాంటపుడు జీవో 111 ఎత్తివేస్తే తప్పేమిటని స్థానికుల వాదన.

ఈ జీవో పరిధిలోని గ్రామస్తులయితే రియల్​ ఎస్టేట్​ వల్ల, ఇతర ప్రాజెక్టులవల్ల నగరం చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనూ భూముల ధరలు పెరుగుతుంటే… ఇక్కడ తమ భూములకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామాల సర్పంచులు కూడా జీవో ఎత్తివేయిస్తామనే హామీలు ఇచ్చి ఎలక్షన్లలో గెలుస్తున్నారు. (సీఎం కేసీఆర్‌ కూడా జీవోను ఎత్తి వేస్తామని రెండు సార్లు హామీ ఇచ్చారు).