- ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల హర్షం
ముషీరాబాద్, వెలుగు: స్థానికతను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో 317పై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తన రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికి అందజేయడంపై బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం జేఏసీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సందీప్, మధు సూదన్ రెడ్డి తదితరులు సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ త్వరితగతిన రిపోర్టును అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టుతో స్థానికత కోల్పోయిన ప్రతి ఉపాధ్యాయునికి తిరిగి స్థానికత లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.