గందరగోళంగా జీవో 76 సర్వే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​కు సంబంధించిన జీవో 76 సర్వే గందరగోళంగా మారింది.  జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించినా సర్వే అస్తవ్యస్తంగా మారడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జీవో76 ప్రకారం ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​ కోసం రెండో విడతలో కొత్తగూడెంలో 1531, ఇల్లందులో 1100కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో కొత్తగూడెంలో 620 అప్లికేషన్లు కరెక్ట్​గా ఉన్నట్లు తేలగా దాదాపు 900కు పైగా రిజెక్ట్​ కావడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

ఇష్టారాజ్యంగా సర్వే

2014కి ముందు సింగరేణి గవర్నమెంట్​కు సరెండర్​ చేసిన ల్యాండ్​తోపాటు ప్రభుత్వ భూమిలో నివాసముండే వారికి ఇండ్ల స్థలాలు రెగ్యులరైజేషన్​ చేసేందుకు ప్రభుత్వం జీవో 76ను జారీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో ​రెండో విడతకు దాదాపు మూడు, నాలుగు నెలల కింద అధికారులు అప్లికేషన్లు తీసుకున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో దాదాపు 1531, ఇల్లెందులో 1100కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వీటిని స్పీడ్​గా, పారదర్శకంగా సర్వే చేసేందుకు కలెక్టర్​ అనుదీప్.. జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి అధికారులు పలువురు సర్వేపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా సర్వే చేశారు. కొన్నిచోట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, లీడర్లు వెంట రాగా సర్వే చేయడంపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. అన్ని అర్హతలు ఉన్నవారి దరఖాస్తులు రిజెక్ట్​ కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగూడెంలోని సన్యాసిబస్తీకి చెందిన దరఖాస్తుదారుడి ఇంట్లో ఓ వ్యక్తి చనిపోతే కీడు వచ్చిందంటూ మూడు నెలలుగా ఇతర ప్రాంతంలో ఉంటున్నారు. సర్వే చేసే టైంలో అధికారులు దరఖాస్తుదారుడికి ఫోన్​ చేశారు. అతను తన వద్ద ఉన్న అన్ని ఆధారాలు చూయించి, మరికొద్ది రోజుల తర్వాత తాము తిరిగి ఇంట్లోకి వస్తామని చెప్పారు. సర్వే టీం మాత్రం వాళ్లు ఇక్కడ ఉండడం లేదంటూ అప్లికేషన్​ను రిజెక్ట్ చేశారు. దీంతో అతను తహసీల్దార్​ ఆఫీస్​ చుట్టూ తిరుగుతున్నారు. మరో సందర్భంలో ఇంటి యజమాని పదేండ్ల కింద చనిపోగా.. ఆ టైంలో కుటుంబసభ్యులు డెత్​సర్టిఫికెట్ ​తీసుకోలేదు. సర్వేకు వచ్చిన అధికారులు యజమాని డెత్​ సర్టిఫికెట్​ కావాలని అడిగారు. వారు డెత్​సర్టిఫికెట్​సమర్పించకపోవడంతో ఆ అప్లికేషన్​రిజెక్ట్​చేశారు. మరోవైపు అప్లికేషన్లు ఎందుకు రిజెక్ట్​ చేస్తున్నారో కూడా సర్వే బృందాలు నోటీస్​ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇల్లెందులో ఇంకా సర్వే కొనసాగుతూనే ఉంది. సర్వేలో అక్రమాలు జరుగుతున్నాయని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. రిజెక్ట్​ చేసిన దరఖాస్తుల విషయంలో కలెక్టర్​ ప్రత్యేక దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.