- తనిఖీ చేసిన ఎక్సైజ్ శాఖ ఆఫీసర్లు
- లేబుల్ మిస్సింగ్ బీర్లుగా గుర్తించిన అధికారులు
తాడ్వాయి, వెలుగు : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం వైన్ షాప్‌లో గోవా బీర్లు దర్శనం ఇవ్వడంతో కలకలం రేగింది. వైన్ షాప్‌లో గోవా లేబుల్‌తో ఉన్న బీర్లు అమ్మడంతో కంగుతిన్న మందుబాబులు సదరు వైన్ షాప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఎక్సైజ్ అధికారులు వైన్ షాపులో ప్రతి బాటిల్ ని తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లేబుల్ మిస్సింగ్ ద్వారా కొన్ని బీర్లు తెలంగాణ అని, మరికొన్ని గోవా అని వచ్చాయన్నారు.
జిల్లాల్లోని మరికొన్ని వైన్ షాప్ లో కూడా ఇలాంటి మద్యం సరఫరా జరిగిందని వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మద్యమేనని ఎక్సైజ్ అధికారులు వివరణ ఇచ్చారు. లేబుల్ మిస్సింగ్ ద్వారా వచ్చిన 27 బీర్ బాటిళ్లను తాము తిరిగి ఎక్సైజ్ మద్యం డిపోకు పంపించామన్నారు. వైన్ షాప్‌లో ఉన్న అన్ని మద్యం బాటిళ్లు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సైజ్ సుంకం చెల్లించినవేనని వారు పేర్కొన్నారు.