పార్టీ మారమని గోవా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రతిజ్ఞ

పనాజీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొత్త కొత్త రాజకీయ సిత్రాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థులు ఇతర పార్టీలకు జంప్ కాకుండా కాపాడుకునేందుకు రాజకీయపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా గోవాలో కాంగ్రెస్ తమ అభ్యర్థులు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా ఓ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరితో ప్రతిజ్ఞ చేయించింది. వారిని గుడులు, మసీదులు, చర్చిలకు తీసుకెళ్లి భవిష్యత్తులో పార్టీ మారమని, కాంగ్రెస్, ప్రజల పట్ల నమ్మకంతో ఉంటానని ప్రమాణం చేయించింది. 
గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్  కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది బీజేపీకి పంచన చేరారు.ఫలితంగా కాంగ్రెస్ సంఖ్యా బలం కేవలం 2కు పరిమితమైంది. ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురుకాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో  జాగ్రత్త చర్యగా కాంగ్రెస్.. పార్టీ టికెట్ ఇచ్చిన 34 మందితో ప్రతిజ్ఞ చేయించింది. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్లు పి.చిదంబరం, కాంగ్రెస్ గోవా ఇంఛార్జ్ దినేష్ గుండు రావు, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గిరీశ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్లు పనాజీలోని మహాలక్ష్మీ టెంపుల్, కొంకణిలోని బంబోలిమ్ క్రాస్, హమ్జా షా దర్గాల వద్ద ప్రతిజ్ఞ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.