వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. దాంతో ఈ రాష్ట్రాల్లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ముందు నాయకులు పార్టీలు మారడంతో రాత్రికిరాత్రే అంచనాలు తారుమారవుతున్నాయి. తాజాగా గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మీకాంత్ పర్సేకర్ ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 40 సీట్లకు గాను 34 సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అయితే మాజీ సీఎం పర్సేకర్.. మాండ్రెమ్ నియోజకవర్గానికి 2002 నుంచి 2017 వరకు ప్రాతినిధ్యం వహించారు. కాగా.. 2017 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్తే చేతిలో పర్సేకర్ ఓడిపోయారు. ఎన్నికల అనంతరం దయానంద్.. బీజేపీలో చేరారు. దాంతో ఇప్పటి ఎలక్షన్లలో ఆ సీటును మళ్లీ దయానంద్ కే కేటాయించారు. దాంతో తీవ్ర అసంతృప్తి చెందిన పర్సేకర్.. బీజేపీ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ మేనిఫెస్టో కమిటీకి హెడ్ గా ఉన్నారు. ఆదివారం తన పదవులన్నింటికీ రాజీనామా చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా మాండ్రెమ్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటికే రెండు, మూడు పార్టీలు తనను సంప్రదించాయని.. కానీ వాటిని తాను నిరాకరించినట్టు ఆయన చెప్పారు.
‘నాకు పార్టీ టికెట్ ఇవ్వకపోవచ్చు. కానీ నా దగ్గర ప్రజల టికెట్ ఉంది. ప్రజలు నేను పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అందుకోసం నేను సిద్ధమవుతున్నాను. పార్టీకి చెందిన పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు నాకు రెండు రోజులు సమయం కావాలని కోరాను. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను’ అని పర్సేకర్ మీడియాకు తెలిపారు.
పర్సేకర్ 2014 నుంచి 2017 వరకు గోవా సీఎంగా చేశారు. పర్సేకర్ కంటే ముందు సీఎంగా ఉన్న మనోహర్ పారికర్‌ను దేశ రక్షణ మంత్రిగా కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోవడంతో ఆయన స్థానంలో పర్సేకర్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ సోప్తే చేతిలో 4,000 ఓట్ల తేడాతో పర్సేకర్ ఓడిపోయారు. దాంతో ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఆ నియోజకవర్గాన్ని సోప్తేకే కేటాయించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది.
For More News..
మేం అధికారంలోకి వస్తే ఇద్దరు సీఎంలు
తెలంగాణలో ముందస్తూ ఉండదు..వెనకస్తూ జరగదు