
- కర్నాటకలోని బెళగావి జిల్లాలో ఘటన
బెంగుళూరు:గోవాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్ కర్నాటకలోని బెళగావి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ ఆటో డ్రైవర్ తో వాగ్వాదం జరిగిన నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లావూ మామ్లేదార్ వెహికల్ శనివారం బెళగావి సిటీలోని శ్రీనివాస్ లాడ్జ్ ఏరియాలో ఓ ఆటోను ఢీకొట్టింది.
దీంతో మాజీ ఎమ్మెల్యే మామ్లేదార్, ఆటో డ్రైవర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన మామ్లేదార్ ఆటో డ్రైవర్ పై చేయి చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ కూడా తిరిగి మాజీ ఎమ్మెల్యేపై దాడి చేశాడు. ఇరువురి మధ్య మొదలైన ఘర్షణ హింసాత్మకంగా మారడంతో స్థానికులు కలగజేసుకుని ఇద్దరిని సముదాయించారు. అనంతరం మామ్లేదార్ లాడ్జికి వెళ్లిపోయారు.
ఈ క్రమంలో లాడ్జి మెట్లు ఎక్కుతుండగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన లాడ్జి సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మామ్లేదార్ మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మామ్లేదార్ పై దాడి చేసిన ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
మామ్లేదార్ మృతికి స్పష్టమైన కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డుకాగా..సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.