మినీబస్సును ఢీకొన్న టిప్పర్
12 మంది మహిళలు, డ్రైవర్ మృతి
కర్నాటకలోని ధార్వాడ జిల్లాలో ప్రమాదం
దావణగెరె నుంచి గోవాకు ట్రిప్ వెళ్తుండగా ఘటన
ధార్వాడ (కర్నాటక): వాళ్లంతా హైస్కూల్ క్లాస్ మేట్లు. ఓ క్లబ్లో మెంబర్లు కూడా. కొన్ని నెలలుగా గోవాకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నరు. సంక్రాంతి సెలవులు రావడంతో మినీ బస్సులో బయలు దేరారు. జర్నీలో సెల్ఫీలు తీసుకుంటూ, కుటుంబ సభ్యులకు పంపించారు. అంతలో.. ఉత్సాహంగా సాగుతున్న వాళ్ల ప్రయాణంలో విషాదం చోటు చేసుకుంది. వాళ్ల వెహికల్కు ప్రమాదం జరగడంతో అందరూ చనిపోయారు. మృతుల్లో నలుగురు డాక్టర్లు కాగా, మిగతావాళ్లు మెడికల్ కాలేజీలలో పని చేస్తున్నారు. కర్నాటకలోని ధార్వాడ జిల్లాలో జరిగిందీ దారుణం.
ప్రమాదం జరిగిందిలా..
దావణగెరె కు చెందిన డాక్టర్ ప్రీతి రవికుమార్ ఆమె ఫ్రెండ్స్(అందరూ మహిళలే) శుక్రవారం తెల్లవారుజామున మినీ బస్సులో గోవా బయలుదేరారు. ధార్వాడలో తెలిసిన వాళ్ల ఇంట్లో టిఫిన్ చేసి, జర్నీ కంటిన్యూ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ధార్వాడకు చేరుకోక ముందే హుబ్లీ -ధార్వాడ బైపాస్ రోడ్డులో ఎదురుగా వచ్చిన ఓ టిప్పర్ వాళ్ల బస్సును ఢీ కొట్టింది. దీంతో 12 మంది మహిళలు, డ్రైవర్ స్పాట్ లోనే చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ చేపట్టారు. నుజ్జునుజ్జయిన వెహికల్ నుంచి డెడ్ బాడీలను బయటకు తీశారు. గాయపడ్డవారిని హాస్పిటల్కు తరలించారు. కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డవాళ్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
పోలీసులు వచ్చేదాకా ఎవరూ హెల్ప్ చేయలే
స్కూల్ డేస్ నుంచి టచ్లో ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయి ఉన్నాం. ఏటా కలిసేవాళ్లం. ఈసారి గోవాలో రిసార్ట్ బుక్ చేసుకున్నం. అందరం కలిసి బస్సులో బయలు దేరాం. యాక్సిడెంట్ జరగ్గానే స్పృహ కోల్పోయా. కళ్లు తెరిచి చూసేసరికి డెడ్ బాడీలు మధ్య ఉన్నా. ధార్వాడలో మా బంధువులకు ఫోన్ చేశా. తర్వాత పోలీసులు స్పాట్ కు వచ్చారు. పోలీసులు వచ్చేవరకూ ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు
– ఆశా, ప్రమాదంలో గాయపడిన మహిళ
For More News..