ఏడు ఖండాల ఎత్తైన శిఖరాలపై గురి

ఏడు ఖండాల ఎత్తైన శిఖరాలపై గురి

మౌంటెనీరింగ్‌ గురించి నాకు ఏమీ తెలియదు. అనుకోకుండా జరిగిపోయింది. మా సొంతూరు తక్కెళ్లపల్లి తండా,యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా.మా అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు.నాకు జిన్నారం (మెదక్‌ జిల్లా)లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సీటొచ్చింది. అక్కడ చదివేటప్పుడు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తరపున రిపబ్లిక్‌ డే పరేడ్‌ లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ పోయిన. అక్కడ సుభాష్‌ అనే టీచర్‌ పరిచయమైండు.ఆయన ద్వారా మల్లకంభం, లంగిడీ గ్రామీణ ఆటలు పరిచయమయ్యాయి . ఈ ఆటల్ని హెల్త్‌‌ లేక్‌ సెంటర్‌ (కాచిగూడ) లో నేర్చు కున్నాను. ఈ ఆటల్లో అంతర్జాతీయ స్థా యిలో ఆడాను. ఎన్నో పతకాలు గెలిచాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు ఉత్తమ అథ్లెట్‌‌ అవార్డు ప్రదానం చేసిందని తెలిపాడు అంగోతు తుకారాం.

ఆటల్లో మేటి…

మల్లకంభం ఆడుతున్నప్పుడు మా సీనియర్లు క్రమ శిక్షణగా ఉండటాన్ని చూసిన. వాళ్లంతా ఎన్‌ సీసీలో పని చేసేవాళ్లు. నేనూ ఎన్‌సీసీలో చేరాలనుకున్న. ఎన్‌ సీసీ ఉన్నకాలేజీ కావాలని పాతబస్తీ (హైదరాబాద్‌ )లో ఎన్‌ బీ సైన్స్‌ కాలేజీలో చేరిన. ఓసారి ఎన్‌ సీసీ క్యాంప్‌ కు ఎంపిక జరుగుతోంది.మా కాలేజీ నుంచి వెళ్లాను. ఉత్తర కాశీలోఉన్న నెహ్రూ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ లో శిక్షణకు ఎంపికయ్యాను. ఆ క్యాంపులో గోడలు, ఎత్తయిన ప్రదేశాలు ఎక్కడం, దిగడం, దొర్లడం బాగా చేసిన.శిక్షణ ఇచ్చే ఆర్మీ ఆఫీసర్లు నీ దగ్గర చాలా టాలెంట్‌‌ ఉందని, మౌంటెనీరింగ్‌కి ట్రైచే యమన్నా రు. ఆ శిక్షణలో నేపాల్‌‌, భారత్‌ ,పోలాండ్‌ దేశాల వాళ్లు పాల్గొన్నారు. వాళ్లందరిలో మెరుగైన ప్రతిభ కనబరిచాను. బంగారు పతకం గెలిచాను. ఇదేఫీల్డుని ఎంచుకోవాలని, మౌంటెనీరింగ్‌ లో బేసిక్‌ కోర్స్‌ చేయమని అధికారులు ప్రోత్సహించారు.

శిఖరంపై విజయోత్సవాలు….

ఆ తర్వాత నెహ్రూ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ లో బేసిక్‌ మౌంటెనీరింగ్‌ కోర్స్‌ (బీఎంసీ)లో చేరిన. శిక్షణ పూర్తయి తర్వాత బెస్ట్‌‌ టెక్నీషియన్‌ అవార్డ్‌‌ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2016లో తెలంగాణ స్టేట్‌‌ అడ్వెంచర్‌ క్లబ్‌ సభ్యులతో కలిసి సముద్రమట్టానికి 17,145 అడుగుల ఎత్తైన మౌంట్‌‌ నర్వో ( హిమాచల్‌‌ ప్రదేశ్‌ ) ఎక్కాను. ఆ తర్వాత సంవత్సరాల్లో మౌంట్‌‌ రుదిగేరా (గంగోత్రి), స్టాక్‌ కాంగ్రి (జమ్ము కాశ్మీ ర్‌ ) పర్వతాలు ఎక్కాను. ప్రపంచంలోని ఏడు ఖండాలలో ఏడు ఎత్తయి న పర్వతాలను ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకున్నా ను. అందులో మొదటిగా దక్షిణాఫ్రికాలో ఉన్న నాలుగో అత్యంత ఎత్తైయిన పర్వతం (సముద్రమట్టానికి 19340అడుగులు ఎత్తున) కిలిమాంజారోని 2018 జూలైలో అధిరోహించాను. పిక్‌ నిక్‌ పేరుతో..పర్వతాలెక్కు తున్నని ఎంతో మందికి తెలుసు. కానీ మా ఇంట్లో తెలియదు. చెబితే వద్దంటారు. పోతానంటే ఒప్పుకోరు.అందుకే వాళ్లకు ఏదో ఒకటి చెప్పి పర్వతాలెక్కతున్నా. 2016లో మౌంట్‌‌ నర్వో ఎక్కడానికి పోయినప్పుడు ఢిల్లీ పోతున్నానని చెప్పిన. ఆ తర్వాత పర్వతాలు చూడ్డానికి ఫ్రెండ్స్‌తో కలిసి పిక్‌ నిక్‌కి పోతున్నానని చెప్పిన. సర్లే బిడ్డా మంచిగా పోయిరమ్మనేవాళ్లు. ఓ సారి టీవీలో వార్త వస్తే చూశారు. పిక్‌ నిక్‌ కి పోతున్నమని ఎటో తిరుగుతున్నవేందని అడిగారు. అవును అది పిక్‌ నిక్‌లాంటిదే. చాలా మంది వస్తారు. వాళ్లలో నేనొకడినినని చెప్పిన.

అమ్మ ఏడ్చింది…

మా అమ్మానాన్న ఎయిర్‌ పోర్ట్‌‌ ఎప్పడూ చూడలే. ఎవరెస్ట్ ఎక్కేందుకు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌‌ నుంచి పోతున్న. వీడ్కోలు చెప్పడానికి చాలా మంది వస్తారు. వాళ్లకు ఎయిర్‌ పోర్ట్‌‌ చూపించి నట్లుంటది. అందరినీ పరిచయం చేయొచ్చని అమ్మానాన్నని తీసుకొచ్చిన. అక్కడికి వచ్చిన పెద్దలంతా పర్వతాలెక్కడంలో ఉండే సవాళ్ల గురించి మాట్లాడుతుంటే మా వాళ్లకు నేను చేసేదేమిటో తెలిసింది. ‘ప్రమాదకరమైన పర్వతారోహణకు మీ అబ్బాయి పోతున్నడు మీరెట్లా ఫీలవతున్నారు?’ అని మీడియా అడిగింది. పర్వతారోహణలో పొంచి ఉండే ప్రమాదాలు తెలిసి అమ్మ ఏడ్చింది. నన్ను కౌగిలించుకుని.. ‘గివన్నీ మనకొద్దు. మన ఇంటికి మనం పోదాం. మన పనేదో మనం చేసుకుందాం’ అంటూ ఏడ్చింది. అందరూ సర్ది చెప్పా రు. మీ అబ్బాయి దేశానికి మంచి పేరు తెస్తున్నడు. మీరు గర్వపడాలని అంటూ అందరూ ఓదార్చారు. అప్పుడు అమ్మ సంతోషంగా పోయిరమ్మంది. ఎవరెస్ట్‌‌ బేస్‌‌ క్యాంప్‌ కి ఈనెల 20వ తారీఖు పోతాను. అక్కడి నుంచి శిఖరానికి చేరుకోవడానికి 45 రోజులు దాకా పడుతుంది.