
- సర్పంచ్ ఇంటిముందున్న రోడ్డుకు పరిహారం
- భూములు తీసుకుని ఐదేండ్లయినా పైసలియ్యలే
- పరిహారం ఇచ్చేదాకా పనులు జరగనివ్వం
- ఆందోళనకు దిగిన నిర్వాసితులు..
మహబూబ్‌నగర్, వెలుగు: పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా ఉద్దండాపూర్ రిజర్వాయర్ కింద మునిగిపోయిన ఊళ్లలో అధికారులు నిర్వహించిన సర్వేలో అన్నీ వింతలే. అధికారులకూ.. రూలింగ్పార్టీకీ దగ్గరివాళ్ల ఆస్తులను ఒక తీరుగా.. మిగిలినవాళ్ల విషయంలో మరోతీరుగా సర్వే చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్‌సీసీ ఇల్లును పెంకుటిల్లుగా మార్చారు. సర్పంచ్ ఇంటిని పక్కా ఇల్లుగా పేర్కొనడం కాకుండా అతని ఇంటి ముందున్న రోడ్డునూ అతని సొంత స్థలంగా రికార్డు చేశారు. టీఆర్ఎస్ వాళ్లయితే లేని ఆస్తులు కూడా మునిగిపోయినట్టు నమోదు చేసి పరిహారం ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఊళ్లో ఒక్క చెట్టు కూడా లేదని రిపోర్టులో పేర్కొన్నడాన్ని బట్టి వాళ్లు ఎంత బాగా సర్వే చేశారో తెలుస్తోందంటున్నారు. సర్వేలో అక్రమాలు జరిగాయని, ఆఫీసర్లు. లీడర్లు కలిసి పేదలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ జడ్చర్ల తహసీల్దార్ఆఫీసును ఇటీవల ముట్టడించారు. తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందితేగాని ఊళ్లు ఖాళీ చేయబోమని స్పష్టం చేశారు. అడిషనల్ కలెక్టర్ నందలాల్పవార్బాధితులను కలిసి న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు.
పచ్చని పొలాలు మునిగాయి
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండాపూర్‌లో 4 వ లిఫ్ట్ ఏర్పాటు చేసి, రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. 16 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్ కు 15.57 కిలోమీటర్ల కట్ట కడుతున్నారు. ఈ ప్యాకేజీ కింద రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించనున్నారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ భూములతోపాటు దాదాపు పది గ్రామాల్లోని రైతుల నుంచి ఇప్పటివరకు 4వేల ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా 600 ఎకరాల భూసేకరణ జరగవలసిఉంది. భూములు తీసుకున్నా ఇంకా చాలామంది రైతులకు పరిహారం రాలేదు. పునరావాసం కల్పించలేదు. ముంపు గ్రామాల వారికి పునరావసం కల్పించిన తర్వాతే భూములు తీసుకుంటామన్న సర్కారు మాట తప్పింది. ముందుగానే దౌర్జన్యంగా భూములు లాక్కొంది. ఉదండాపూర్, కిష్టారం, చిన్నగుట్టతండా, సమగడ్డ తండా, ఒంటి గుడిసెలు, దేవుని గుట్ట, రవి తండా, తుమ్మల గుంట, రేగడి బట్టి తండ, గొల్లోనిబట్టి గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నారు.
ఐదేండ్లయినా పైసలియ్యలే
రైతులకు పరిహారం.. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే రిజర్వాయర్ పనులు చేపట్టారు. భూములు తీసుకుని ఐదేండ్లయినా పరిహారం ఇవ్వకపోవడంతో చాలా సార్లు రైతులు రోడ్డెక్కవలసివచ్చింది. భూములు లేక జీవనాధారం కోల్పోయామని, భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భూములు, ఇళ్లు గుంజుకొని తమను దేనికీ కాకుండా చేశారని మండిపడుతున్నారు. ధరణిలోనూ భూముల వివరాలు తొలగించడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర ప్రయోజనాలు కూడా అందడంలేదు. చాలామంది రైతులు పిల్లలకు తిండిపెట్టేందుకు కూలీపనులు వెళ్తున్నట్టు వాపోతున్నారు.
పాత జీవో ప్రకారం పరిహారం ఇస్తారట
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తామని ముందు చెప్పిన సర్కార్ప్రస్తుతం పాత చట్టానికి అనుగుణంగా పరిహారం ఇస్తామనడం పట్ల రైతులు మండిపడుతున్నారు. తరిపొలం, బోరు బావి ఉంటే ఎకరానికి రూ. 6.5లక్షలు, మెట్ట పొలానికి రూ.6లక్షలుగా నష్టపరిహారం ఇస్తామంటున్నారు. ఇక్కడ ఎకరానికి దాదాపు రూ. 50లక్షల వరకు ధర పలుకుతుందని, ప్రభుత్వం మాత్రం రూ. 6 లక్షలు ఇస్తానంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పరిహారాన్ని అంగీకరించేదిలేదని, పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చేవరకు జరపనివ్వబోమంటూ పనులు అడ్డుకుంటున్నారు.
పరిహారం పెంచాలి
ఉదండపూర్ రిజర్వాయర్ కింద ఏడు తండాల్లో భూములు ఎఫెక్ట్అయ్యాయి. తమ ఇష్టమొచ్చినట్టు ఆఫీసర్లు రికార్డుల్లో రాసుకున్నారు. రెండు వందల గజాల్లో ఆర్‌సీసీ ఇల్లు ఉంటే తక్కువ జాగాలో రేకుల ఇల్లు ఉన్నట్టు నమోదు చేశారు. మళ్లీ సర్వే చేసి పరిహారం పెంచాలి. ‑ అక్బర్, ఉదండపూర్, జడ్చర్ల మండలం..
రోడ్డుకు కూడా పరిహారం
రిజర్వాయర్ కింద ఇండ్లు కోల్పోతున్న వారి బాధలు ఎన్నని చెప్పాలి. అధికార పార్టీ లీడర్లు చెప్పినట్టే ఆఫీసర్లు రాసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ రోడ్డును కూడా తమకు కావాల్సినవారి పేర వాళ్ల సొంత స్థలంగా రాయించారు.
‑ యాదయ్య, ఉదండపూర్, జడ్చర్ల మండలం