- కంపెనీ హిస్టరీలోనే అతి పెద్దది
హైదరాబాద్, వెలుగు: జీఓసీఎల్ సబ్సిడరీ ఐడీఎల్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్‌కు కోల్ ఇండియా నుంచి భారీ ఆర్డరు అందింది. ఈ ఆర్డరు కింద కోల్ ఇండియాకు రూ. 766 కోట్ల విలువైన బల్క్ ఎక్స్‌ప్లోజివ్స్‌ను సప్లయ్ చేయా ల్సి ఉంటుంది. రాబోయే రెండేళ్ల కాలంలో కోల్ ఇండియాకు ఈ ఎక్స్‌ప్లోజివ్స్‌ను సప్లయ్ చేయాలని జీఓసీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ హిస్టరీలో ఇదే అతి పెద్ద ఆర్డరని వెల్లడించింది.
కోల్ ఇండియాకు తాము టాప్–టైర్ఎక్స్ప్లోజివ్స్ ఇవ్వడంతోపాటు, మైనింగ్ సర్వీసులనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ఇంతకు ముందు ఆర్డరుతో పోలిస్తే వాల్యూమ్ పరంగా తాజా ఆర్డరు 58 శాతం పెద్దదని వివరించింది. క్వాలిటీ ప్రొడక్టులను అందిస్తున్నామనడానికి ఈ పెద్ద ఆర్డరు నిదర్శనంగా నిలుస్తుందని జీఓసీఎల్ సీఈఓ పంకజ్ ఈ సందర్భంగా చెప్పారు. క్వాలిటీ స్టాండర్డ్స్‌తో కొత్త ఆర్డరును నెరవేర్చనున్నట్లు పేర్కొన్నారు.
మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ఫుల్ రేంజ్ బల్క్ ఎక్స్‌ప్లోజివ్స్‌ను జీఓసీఎల్ తయారు చేస్తోంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఈస్ట్ ఏషియా, యూరప్, సౌత్ అమెరికా మార్కెట్లకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తోంది. 8 మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్న జీఓసీఎల్ 20 కి పైగా దేశాలకు ఎక్స్‌ప్లోజివ్స్‌ను సప్లయ్ చేస్తుండటం విశేషం.