దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

  •    బీజేపీ అనుకుంటున్నట్టు పోలింగ్​ డబ్బాల్లో కాదు: సీఎం రేవంత్​
  •     ప్రధాని మోదీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడ్తున్నరు
  •     ఓటమి భయంతో ఇండియా కూటమిపై ఇష్టమున్నట్లు మాట్లాడ్తున్నరు
  •     ఏనాడూ ఒకరి ఆస్తిని లాక్కొని ఇంకొకరికి కాంగ్రెస్​ ఇయ్యలేదు
  •     వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్​కు రైతులు రాజకీయ లగ్గం చేసిన్రు
  •     బీజేపీకి అదే రీతిలో బుద్ధి చెప్పాల్సిన టైమ్​ వచ్చింది
  •     నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్త.. ఇతర మతాలను గౌరవిస్త
  •     సెప్టెంబర్​ 17లోగా నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీలు ఓపెన్​చేస్తం
  •     తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడ్తం.. దానికి అంబేద్కర్ పేరు పెడ్తం
  •     ఆదిలాబాద్​, నిజామాబాద్, చేవెళ్ల ఎన్నికల సభల్లో సీఎం

ఆదిలాబాద్​ / నిజామాబాద్​ / సికింద్రాబాద్​, వెలుగు: ప్రజల మధ్య విద్వేషాలను ప్రధాని నరేంద్ర మోదీ రెచ్చ గొడ్తున్నారని, ఆయనకు ఓటమి భయం పట్టుకున్నదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు కట్టబెడ్తారని ప్రధాని హోదాలోని మోదీ రెచ్చగొడ్తున్నరు. వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిన కేసీఆర్​కు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా రాజకీయ లగ్గం చేసిన్రు.. రాజకీయంగా మళ్లీ  మొలవకుండా వంద మీటర్లలోతులో పాతి, సిమెంట్​ కాంక్రీట్​తో సమాధి కట్టిన్రు.

ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి పొలిటికల్​ బిజినెస్​ చేస్తున్న బీజేపీకి అదే రీతిలో బుద్ధి చెప్పాల్సిన టైమ్​ వచ్చింది” అని  ఆయన అన్నారు.  సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్​ జిల్లా తూంకుంటలో నిర్వహించిన కాంగ్రెస్​ ఎన్నికల ప్రచార సభల్లో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు.  ‘‘దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. కానీ, బీజేపీ అనుకుంటున్నట్టు పోలింగ్​ బూత్​ డబ్బాల్లో కాదు. బీజేపీ నేతల రాజకీయ వ్యాపారాన్ని ప్రజలు గమనిస్తున్నరు. నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్త. ఇతర అన్ని మతాలను, వారి సంప్రదాయాలను గౌరవిస్త” అని ఆయన తెలిపారు.

అంబేద్కర్​ రచించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రధాని అయిన మోదీ.. రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్​ మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు ఒకరి ఆస్తులు లాక్కొని మరొకరికి ఇవ్వలేదు. బలమైన వ్యవస్థను రూపొందించింది. ఆస్తులు లాక్కొని పంచే చట్టం దేశంలోనే లేదు. 13 ఏండ్లు సీఎంగా, పదేండ్లు ప్రధానిగా ఉన్న మోదీకి ఈ మాత్రం తెల్వదా?  ఓటమి భయం పట్టుకొని మోదీ రెచ్చగొడుతున్నరు. తండ్రి ఆస్తి కొడుకు పొందాలన్నా.. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఆస్తి పంపకాలు జరగాలన్నా అది అంబేద్కర్​ రచించిన రాజ్యాంగ చట్టంతోనే సాధ్యం” అని స్పష్టం చేశారు.

భావోద్వేగాలతో బీజేపీ నేతలు ఎన్నాళ్లు ఆడుకుంటారని ఆయన మండిపడ్డారు. ‘‘జూటా మాటలు బంద్​ చేయండి. ఎలక్షన్స్​లో గెలవాలనుకోవడం తప్పుకాదు. కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి, చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూడడం మంచిదా? అశాంతి రాజేసి ప్రజల మధ్య పంచాయతీ పెడితే దేశం కుప్పకూలి తీరని నష్టం జరుగుతుంది. అందుకే బీజేపీని ఓడించాలి. కాంగ్రెస్​ను గెలిపించాలి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

నిజాం షుగర్స్​ ఫ్యాక్టరీలు ఓపెన్​చేస్తం

కేంద్రంలో ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని, రాహుల్​ ప్రధాని అవుతారని సీఎం రేవంత్​ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్​ ఎంపీగా  జీవన్​రెడ్డి గెలిస్తే ఆయనను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని చేయించే బాధ్యత తనదని చెప్పారు. ‘‘ఎవరి దగ్గరికో వెళ్లి అడగడం కాకుండా జీవన్​రెడ్డి కేంద్ర మంత్రి అయితే.. ఆయన సంతకంతో పసుపు బోర్డు, నిజాం చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్​ అయితయ్​” అని అన్నారు.

‘‘ఎవుసం తెల్సిన జీవన్​రెడ్డి గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగతది. ఆయన్ను కరీంనగర్​ పార్లమెంట్​ స్థానంలో పోటీ చేయించాలకున్న. కానీ జీవన్​రెడ్డి రైతుల సేవ కోసం ఇందూర్​ పార్లమెంట్​ సెగ్మెంట్​ ఎంచుకున్నరు” అని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్​బాబు నేతృత్వంలోని చక్కెర ఫ్యాక్టరీల అధ్యయన కమిటీ రిపోర్టును త్వరగా తెప్పించుకొని, సెప్టెంబర్​ 17లోగా ఫ్యాక్టరీలను ఓపెన్​ చేయిస్తానని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. నిజామాబాద్​ అంటే తనకు ప్రత్యేక అభిమానం అని తెలిపారు. 

ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నరు

కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘ఈ ప్రభుత్వం పడిపోతే పేదలకు అందే పథకాలు ఆగిపోతయ్​. కాంగ్రెస్ ను పడగొట్టినా, ఆదిలాబాద్​ ఎంపీగా ఆత్రం సుగుణ ఓడిపోయినా పేదలకే నష్టం. కేసీఆర్, మోదీకి కాదు! కేసీఆర్, మోదీ ఇచ్చిన హామీలను పదేండ్లలో కూడా అమలు చేయలేదు. కానీ మేం వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తే కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని  పడగొట్టాలనుకుంటున్నరు” అని ఆయన అన్నారు. 

ఎన్ని ఎకరాల్లోనైనా వరి వేయండి.. బోనస్​ ఇస్తం

‘‘వరి పంట ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో అయినా సాగు చేయండి. ప్రతి క్వింటాల్​ వడ్లకు రూ.500 బోనస్​ ఇచ్చి కొనే బాధ్యత నాది. బాసర సరస్వతీ దేవీపై ప్రమాణం వేసి చెప్తున్న.. ఆగస్ట్​ 15 లోపు రూ.2 లక్షల పం రుణాలు మాఫీ చేస్త. పవర్​లోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు అమలు చేసినం. ఎన్నికల కోడ్​ రావడంతో మిగితావి ఆగినయ్​” అని సీఎం రేవంత్​ చెప్పారు. 

బీసీలపై కేసీఆర్​, మోదీ కుట్ర

బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా ప్రధాని నరేంద్ర మోదీ, బీఆర్​ఎస్ ​అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్​రావు కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి​ అన్నారు. ‘‘బీసీ జనాభా లెక్కలు తీయాలంటే కేసీఆర్​, మోదీ తీయలేదు. నిధులు ఇయ్యలేదు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే శాసనసభలో బీసీ లెక్కల కోసం ఆమోదం తెలిపింది. బీసీలు ఎంత శాతం ఉంటే అంత నిధులు వాళ్లకు  ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నం.

బీసీల లెక్కలు తెలిస్తే.. వారికి నిధులిస్తే రాజ్యాధికారంలో వారు వాటా అడుగుతారని కేసీఆర్, మోదీ కుట్ర చేసి ప్రభుత్వాన్ని పడగొడుతామంటున్నరు. కేసీఆర్, మోదీ తోడు దొంగలు. ఇందులో ఒక దొంగను డిసెంబర్ 7న బండకేసి కొట్టినం.. ఇప్పుడు  రెండో దొంగను గోడకేసి కొట్టాలి. బీజేపీని ఓడగొట్టాలి” అని ఆయన పేర్కొన్నారు. ప్రధా న మంత్రిగా అందరిని సమానంగా చూడాల్సిన బాధ్య త ఉన్న మోదీ మాత్రం నిధులన్నీ గుజరాత్​కు తీసుకెళ్లారని మండిపడ్డారు.  

బీఆర్​ఎస్​ను తాకట్టుపెట్టిండు

‘‘బిడ్డ బెయిల్​ కోసం మోదీ దగ్గర బీఆర్​ఎస్​ పార్టీని కేసీఆర్​ తాకట్టుపెట్టిండు. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నడు” అని సీఎం రేవంత్​రెడ్డి ఆరోపించారు. పదేండ్లలో రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసిందేమీ లేదని విమర్శించారు. హుజూరాబాద్​ ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఆ ప్రాంతానికి ఈటల రాజేందర్​ ఏం చేశారని, ఇప్పుడు మల్కాజ్​గిరికి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా కిషన్​రెడ్డి ఉండి ఎన్ని నిధులు తెచ్చారని నిలదీశారు. కేసీఆర్​ హయాంలో అక్రమాలు, అవినీతి జరిగితే ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో విచారణ జరిపించలేదని ప్రశ్నిం చారు.

 ‘‘2019 ఎన్నికల్లో మల్కాజ్​గిరి ఎంపీ అభ్యర్థిగా నన్ను కార్యకర్తలే ముందుండి గెలిపించారు. మల్కాజ్​గిరి అభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు చేశాను. కొన్ని సమస్యలను పరిష్కరించగలిగాను. ప్రస్తుతం మల్కాజ్​గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పరాయివాళ్ల చేతిలో ఉన్నాయి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన వాళ్లు ఎంపీగా ఉంటే  సమస్యలు పరిష్కారం అవుతాయి. చేవెళ్లలో సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేయాల్సింది కాని నేనే అధిష్టానానికి చెప్పి మల్కాజ్​గిరి బరిలో దింపాను. అత్యధిక మెజార్టీతో సునీతమ్మను గెలిపించాలి. సునీ తమ్మకు వేసే ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్లే” అని ఆయన అన్నారు. ఆయా ప్రచార సభల్లో మంత్రులు శ్రీధర్​ బాబు, సీతక్క, పార్టీ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు. 

రైతులను మోసం చేస్తే పాతరే

‘‘ఆసియా ఖండంలో ఖ్యాతిగాంచిన  నిజాం చక్కెర ఫ్యాక్టరీలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఓపెన్​ చేస్తామని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ నమ్మించిండు. నడిచే ఫ్యాక్టరీలను క్లోజ్​ చేసిండు. వ్యవసాయ అవసరాలు ఎక్కడ తీర్చాల్సి వస్తదోనని తప్పించుకోవడానికి.. వరి వేస్తే ఉరేనని రైతులను భయపెట్టిండు. మోసం చేస్తున్న కేసీఆర్​ ఇక వద్దనుకొని మొన్నటి ఎలక్షన్​లో వంద మీటర్ల లోతులో ఆయన రాజకీయాలను జనం మూసేసిన్రు. రైతులతో పెట్టుకుంటే ఏమైతదో నిజామాబాద్​ జిల్లాలో చేసి చూపెట్టిన్రు” అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు.

పాలకులు ఎవరైనా తప్పు చేస్తే మెడలు ఎట్ల వంచాల్నో రైతులకు బాగా తెలుసని.. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో రైతులు ఆందోళన చేసి ప్రధాని మోదీ మెడలు వంచి వాటిని రద్దు చేసేదాకా వదల్లేదని ఆయన తెలిపారు.  ‘‘పసుపు బోర్డుతోపాటు జిల్లాకు ఫండ్స్​ తెచ్చి డెవలప్​ చేస్తారని భావించి 2014లో కవితను నిజామాబాద్​ రైతులు ఎంపీని చేసిన్రు.  అవి నెరవేరకపోవడంతో 2019లో అర్వింద్​కు చాన్స్​ ఇచ్చిన్రు.

కానీ, ఏం చేసిండు? స్పైస్​ బోర్డు చూపి పసుపు బోర్డు అంటే నమ్మెంత అమాయకులుకాదు రైతులు. చూడబోతే తాతకు దగ్గునేర్పినట్లు ఉంది అర్వింద్​ వ్యవహారం. వంద రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీలు తెరుస్తామని హామీ ఇచ్చిన వాళ్ల (కేసీఆర్​, కవితను ఉద్దేశించి) ఖర్మ కాలేలా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పొలిమేరలు దాటించిన్రు. గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న బోడగుండోళ్లను ఏం చేయాలో ఆలోచించాలి” అని సీఎం రేవంత్​ అన్నారు.

కాంగ్రెస్​కు, కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘భువనగిరి పాదాల వద్ద గగన మంత ఎత్తున ఎగసిన అభిమాన కెరటాలు.. త్యాగాల స్థూపాల సాక్షిగా సాగిన జైత్రయాత్ర ఇది. కాంగ్రెస్ కు, కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ.. కంచుకోటపై ఎగురుతుంది గెలుపు జెండా” అంటూ ట్వీట్ చేశారు. భువ నగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కార్నర్ మీటింగ్​లో పాల్గొన్న వీడియోలను రేవంత్ షేర్ చేశారు.

ఇయ్యాల కొడంగల్,నాగర్​కర్నూల్​లో రేవంత్ ప్రచారం

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కొడంగల్, నాగర్​కర్నూల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం మహబూబ్​నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న తన సొంత నియోజకవర్గం కొడంగల్​లో ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డినిగెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం నాగర్​కర్నూల్ లోక్​సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా రేవంత్ ప్రచారం చేయనున్నారు.

తుమ్మిడి హెట్టి వద్దే ప్రాజెక్టు.. ఆదిలాబాద్​కు వర్సిటీ

‘‘తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించాలని, ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టాలని కాకా వెంకటస్వామి పట్టుబట్టి ప్రారంభించారు. కానీ, కేసీఆర్ కు కాకాపై కోపమో..అంబేద్కర్ మీద పగనో తెలియదు గానీ ప్రాజెక్టును పక్కన బెట్టిండు. అందుకే తప్పకుండా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును కడ్తం. మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నం. అక్కడ ముంపు భూమి 1,800 ఎకరాల సమస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నం. ప్రాజెక్టును కట్టి, అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత తీసుకుంటం” అని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు.

ఆదిలాబాద్ లో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తప్పకుండా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, బోథ్  నియోజకవర్గంలో కుప్టీ ప్రాజెక్టును కడుతామని తెలిపారు. కడెం ప్రాజెక్టు ను గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం వల్ల కూలిపోయే ప్రమాదానికి వచ్చిందని, ఇప్పుడు ప్రాజెక్టుకు రిపేర్లు చేయిస్తున్నామని అన్నారు. ‘‘ఈ ప్రాంతంలోని సిమెంట్ ఫ్యాక్టరీ ని తెరిపించాలని మోదీ, కేడీ కేసీఆర్ కు ఎన్నిసార్లు అడిగిన అతీగతీ లేకుండా పోయింది. త్వరలోనే తెరిపించేందుకు చర్యలు తీసుకుంటాం”అని చెప్పారు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా ఇంద్రవెల్లిని పర్యాటక క్షేత్రంగా మార్చడంతో పాటు, ఆదివాసీల జాతరలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.