బడంగ్ పేట, వెలుగు: మీర్‌పేట్ టీచర్స్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లారు. మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శనివారం కొందరు అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామి, గణపతి స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలను గుడిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.
అనంతరం రాత్రి 12 గంటల సమయంలో అయ్యప్ప స్వాములు దేవాలయం నుంచి వెళ్లిపోయారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దేవతామూర్తుల వద్ద పూజారి తో పాటు వంట పని చేసే వాళ్లు దేవాలయాన్ని శుభ్రం చేసే వారు నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచేసరికి పంచలోహ విగ్రహాలు కనిపించలేదు. వెంటనే వారు ఆలయ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఆలయ చైర్మన్ బి. కొండల్ రెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాట్టు తెలిపారు.