- ప్రో ఖలిస్తానీ గ్రూప్ నుంచి ఆప్ చీఫ్‌కు ప్రాణహాని
న్యూఢిల్లీ: దేవుడే తనను కాపాడుతాడని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. దేవుడు అండగా ఉన్న వాళ్లను ఎవరూ ఏమీ చేయలేరని తెలిపారు. ఎప్పుడైతే భూమిపై నూకలు చెల్లుతాయో.. అప్పుడు దేవుడి నుంచి పిలుపు వస్తుందన్నారు. అప్పుడు అందరూ వెళ్లిపోవాల్సిందేనని తెలిపారు. ప్రో ఖలిస్తానీ గ్రూప్ నుంచి ప్రాణహాని ఉందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుపై అర్వింద్ కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. దీనికిముందు న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్లో నామినేషన్ దాఖలు చేశారు.
తొలుత వాల్మీకి, హనుమాన్ ఆలయాల్లో తన భార్య సునీతతో కలిసి కేజ్రీవాల్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆప్ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయల్దేరి న్యూఢిల్లీ కలెక్టరేట్‌కు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆప్ హయాంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి. మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం. ఫుల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీజేపీకి ఢిల్లీ అభివృద్ధి విషయంలో విజన్ అంటూ ఏదీ లేదు. సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. వచ్చే ఐదేండ్లలో ఏం చేస్తారో చెప్పడంలేదు. బూట్ల జతలతో ఢిల్లీ ప్రజలను కొనలేరు. బీజేపీ ఏం చేస్తున్నదో ప్రజలందరూ చూస్తున్నరు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
పాకిస్తాన్ సాయంతో అలజడి సృష్టించే చాన్స్
ప్రో ఖలిస్తానీ గ్రూప్ నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉన్నట్లు తెలిసిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. పంజాబ్‌లో కొన్ని రోజుల కింద
ప్రో ఖలిస్తాని గ్రూప్‌కు చెందిన ఇద్దరు పట్టుబడ్డారు. వారిని విచారించగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో అర్వింద్ కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ, పంజాబ్‌లో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నట్లు తెలిసింది. అయితే, కేజ్రీవాల్‌కు జడ్ ప్లస్ భద్రత ఉన్నది. పైలెట్, ఎస్కార్ట్ టీమ్, ప్రొటెక్షన్ స్టాఫ్ తో పాటు సెర్చ్ అండ్ ఫ్రిస్క్ యూనిట్లు రక్షణ కల్పిస్తున్నాయి. మొత్తం 63 మంది కేజ్రీవాల్ చుట్టూ ఉంటారు. ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో మరో 15 మంది సీఏపీఎఫ్ సిబ్బందిని నియమించారు.
కేజ్రీవాల్‌పై ఈడీ విచారణకు కేంద్రం అనుమతి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. నిరుడు మార్చిలో అరెస్ట్ అయిన అర్వింద్ కేజ్రీవాల్‌పై.. ఈడీ అధికారులు ఇప్పటికే స్పెషల్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ప్రజాప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను విచారించేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఎల్జీ వీకే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. దీనికి ఆయన ఆమోదం తెలపడంతో ఈ విషయాన్ని ఈడీ.. కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆయన్ను విచారించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాగా, ఆప్‌పై ఐదు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మోదీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ లీడర్లను కించపరుస్తూ ఏఐ వీడియోలు క్రియేట్ చేసినందుకు 4 ఎఫ్ఐఆర్లు, పూర్వాంచలీయులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు కేజ్రీవాల్‌పై ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అన్ని ఎఫ్ఐఆర్లలో ఢిల్లీ సీఎం ఆతిశి, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ పేర్లున్నాయి.