కొడంగల్/బషీర్ బాగ్, వెలుగు: ఖైరతాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం లక్డీకాపూల్లోని వాసవి సేవా కేంద్రంలో శ్రీగోదాదేవి రంగనాథ స్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. 180 జంటలు పాల్గొని లక్ష పసుపు కొమ్ముల సామూహిక నోము నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య పండితులు కల్యాణాన్ని ఘనంగా జరిపించారు. ఏటా భోగి నాడు గోదాదేవి కల్యాణం జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్ గుప్తా పాల్గొన్నారు.
అలాగే పేదల తిరుపతిగా పేరొందిన కొడంగల్శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం గోదాదేవి కల్యాణం వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మనిషిగా పుట్టి భగవంతునిలో ఐక్యం కావడం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానమే గోదాదేవి కల్యాణమని పండితులు చెప్పారు. శ్రీరంగనాథుడిని ప్రేమించి, పూజించి ఆయనలో ఐక్యమైన గోదాదేవి కల్యాణం ఎంతో ప్రత్యేకమైందన్నారు. నిర్వాహకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్తలు నందారం కుటుంబ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.