కోరుట్ల/సుల్తానాబాద్/ రామడుగు, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో గోదా రంగనాథుల స్వామి కల్యాణ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో గుట్టపై వెలిసిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో గోదా రంగనాథుల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి వేదమంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో గోదా రంగనాయక స్వామి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది.
ఆలయ చైర్మన్ మురళి, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి, భక్తులు పాల్గొన్నారు. రామడుగు మండల కేంద్రంలోని అష్టసఖి వేణుగోపాలస్వామి ఆలయంలో గోదారంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం కొండగట్టు వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. షానగర్ గ్రామానికి చెందిన చిరుత రామచంద్రం- సంధ్య దంపతులు గోశాలను ఏర్పాటుచేసి గోవులను అందజేశారు.