గోదావరి ఉగ్రరూపం.. నీటి మునిగిన ధర్మపురి సంతోషి మాత ఆలయం

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా  ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.  భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. జగిత్యాలలోని  ధర్మపురి సంతోషిమాత ఆలయంలోకి  వరద నీరు వచ్చి చేరింది. కడెం ప్రాజెక్టు,ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ లు  గేట్లు ఎత్తడంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ ఎత్తున వరద నీరు దిగువకు వెళ్తుండటంతో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్పీ భాస్కర్ సూచించారు. 

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరిలో ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు గోదావరి వరద ప్రవాహం 46.20 అడుగులకు చేరుకుంది.  ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. నదిలో వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది. 

ALSO READ :రైతును రాజుగా చేయడమే బీజేపీ లక్ష్యం: రాంచందర్ రావు

ఎగువ ప్రాంతం నుంచివచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు వేగంగా  పెరుగుతోంది. లోతట్టు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సహకరించాలని ఈ సందర్బంగా కొత్తగూడెం కలెక్టర్‌ ప్రియాంక కోరారు. శుక్రవారం భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని  కలెక్టర్‌ సూచించారు.