గోదావరి కరకట్ట పనులు మరింత లేట్‌‌‌‌

  • 20 కిలోమీటర్ల కట్టకు రూ. 113 కోట్లతో ఇప్పటికే టెండర్లు పూర్తి
  • జియో ట్యూబ్స్‌‌‌‌‌‌‌‌ విధానంలో పనులు చేయాలని  అగ్రిమెంట్‌‌‌‌లో మార్పులు
  • వరద మొదలు కావడంతో ఆగిపోయిన పనులు
  • సెప్టెంబర్‌‌‌‌ నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : ములుగు జిల్లాలో గోదావరి నది కరకట్ట నిర్మాణ పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 20 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించేందుకు ఆఫీసర్లు గతంలోనే టెండర్లు పూర్తి చేశారు. కానీ పాత పద్ధతిలో కాకుండా జియోట్యూబ్స్‌‌‌‌ విధానంలో పనులు చేయాలని అగ్రిమెంట్‌‌‌‌లో మార్పులు చేశారు. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సైతం గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. అయితే కొత్త డ్రాయింగ్‌‌‌‌లకు అనుగుణంగా పనులు చేపట్టకముందే గోదావరిలో వరద మొదలయింది. దీంతో పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, వరద తగ్గాక సెప్టెంబర్‌‌‌‌లో కరకట్ట పనులు ప్రారంభమయ్యే ఛాన్స్‌‌‌‌ ఉందని ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

గోదావరిలో మునుగుతున్న గ్రామాలు

గోదావరికి వరదలు వస్తే ములుగు జిల్లాలోని పల్లెలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని గోదావరి తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. రెండేళ్లుగా వచ్చిన వరదల్లో ఏటూరునాగారం మండలంలోని బెస్తవాడ, ఎస్సీకాలనీ, రామన్నగూడెం, కొత్తూర్, బుట్టాయిగూడెం గ్రామాలు, మంగపేట మండలంలోని అక్కినపల్లి, పోదూర్, కమలాపూర్, వాడగూడెం, కత్తిగూడెం, రమణక్కపేట, గుడ్డేలుగులపల్లి, బోర్‌‌‌‌ నర్సాపూర్‌‌‌‌, మంగపేట గ్రామాలకు చెందిన వేలాది మందిని ప్రభుత్వ పునారావాస కేంద్రాలకు తరలించారు.

గోదావరికి వరదలు వచ్చిన ప్రతీసారి ఇదే తంతు జరుగుతుంది. ఇదేకాకుండా వేలాది ఎకరాల్లో పంట భూములకు నష్టం వాటిల్లుతుంది. ఇసుక మేటలు వేసి పనికి రాకుండా పోతున్నాయి. గోదావరి ఒడ్డు కొట్టుకుపోతుండడంతో వ్యవసాయ భూములు గోదావరిలో కలిసిపోతున్నాయి. గత 30 ఏండ్లలో నాలుగు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాలకుపైగా వ్యవసాయ భూములు గోదావరిలో కలిసినట్లు రైతన్నలు చెబుతున్నారు. మంగపేటలో పుష్కరఘాట్‌‌‌‌, బీటీ రోడ్లు సైతం కొట్టుకుపోయాయి. 

జియో ట్యూబ్స్‌‌‌‌ విధానంలో కరకట్ట

ములుగు జిల్లాలోని గోదావరి ‌‌‌‌తీర ప్రాంతంలో 20.5 కిలోమీటర్ల దూరం కరకట్ట నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.113 కోట్లు మంజూరు చేసింది. మంగపేట దగ్గర 2.5 కిలోమీటర్లు, రామన్నగూడెం దగ్గర 12, రాంనగర్‌‌‌‌ దగ్గర 6 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణానికి టెండర్లు కూడా పూర్తి చేశారు. అయితే పాత రివిట్‌‌‌‌మెంట్‌‌‌‌ పద్ధతిలో కాకుండా కొత్త విధానంలో పనులు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. అలహాబాద్‌‌‌‌ వద్ద గంగానదిపై చేసిన పనుల మాదిరిగానే ఇక్కడా పనులు చేయాలని కాంట్రాక్ట్‌‌‌‌ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. గోదావరి వరదల నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగేలా జియో ట్యూబ్స్‌‌‌‌ విధానాన్ని పరిశీలించి కొత్త డ్రాయింగ్‌‌‌‌కు అనుమతులిచ్చింది. అయితే నదిలో ఇప్పటికే వరద మొదలుకావడంతో పనులు చేయడం ఇబ్బందిగా మారింది. వరద తగ్గాక పనులు చేపట్టే అవకాశం ఉంది.

సెప్టెంబర్‌‌‌‌లో పనులు ప్రారంభిస్తాం 

ములుగు జిల్లాలో గోదావరి కరకట్ట నిర్మాణానికి జియో ట్యూబ్స్‌‌‌‌ విధానంలో పనులు చేయాలని సర్కార్‌‌‌‌ ఆదేశించింది. ఇప్పటికే వరద స్టార్ట్‌‌‌‌ కావడంతో కరకట్ట నిర్మాణ పనుల ప్రారంభానికి అంతరాయం కలుగుతుంది. సెప్టెంబర్‌‌‌‌ నెలలో పనులు మొదలుపెడతాం. రూ.113 కోట్లతో టెండర్లు కంప్లీట్‌‌‌‌ అయ్యాయి. కొత్త అగ్రిమెంట్‌‌‌‌ ప్రకారం రివైడ్జ్‌‌‌‌ ఎస్టిమేట్‌‌‌‌‌‌‌‌ వేయాల్సి ఉంది.

– శరత్‌‌‌‌‌‌‌‌, ఇరిగేషన్‌‌‌‌ ఈఈ, ములుగు జిల్లా