Godavari Express :పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ 

Godavari Express :పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ 

హైదరాబాద్ : విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ కు పెను ముప్పు తప్పింది. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సమీపంలో గోదావరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి, బీబీనగర్, ఘట్ కేసర్ రైల్వేస్టేషన్లలో పలు రైళ్లను అధికారులు ముందస్తుగా నిలిపివేశారు. 

ట్రైన్ పట్టాలు తప్పిన విషయాన్ని పక్కనే ఉన్న గూడ్స్ రైలు పైలెట్ గమనించి.. వెంటనే గోదావరి ఎక్స్ ప్రెస్ పైలెట్ కు చెప్పడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే గోదావరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను పైలెట్ నిలిపివేశాడు. 

కాజీపేట-సికింద్రాబాద్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరోవైపు.. పట్టాలు తప్పిన ఎస్ 5 బోగీలను వదిలి గోదావరి ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ బయల్దేరింది. దాదాపు 500 మీటర్ల వరకూ రైల్వేట్రాక్ డ్యామేజీ అయినట్లు తెలుస్తోంది. 

విచారణ జరుగుతోంది : ఆర్డీఓ రవికుమార్

ఈరోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన 6 బోగీలు పట్టాలు తప్పాయని ఆర్డీఓ రవికుమార్ చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి చేరుకుని రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను రైల్వే ఇంజనీరింగ్ టీం సభ్యులు విచారణ చేస్తున్నారని తెలిపారు. 

ఎవరికీ గాయాలు కాలేదు : సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ 

కొంతమందిని ట్రైన్ లో సికింద్రాబాద్ కు పంపించామని, మరికొందరు ప్రయాణికులు ఇతర వాహనాల్లో తమ గమ్య స్థానాలకు వెళ్లారని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. అత్యాధునిక కోచ్ లు ఉండడం వల్లే పట్టాలు తప్పినా ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు.