భద్రాచలం, వెలుగు: గోదావరి వరద బాధితులకు నేటికీ పరిహారం రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు తహసీల్దార్ తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. 4500 మందికి పైగా బాధితులకు పరిహారం అందలేదు. పూర్తిగా ఇండ్లు మునిగినోళ్లకు కాకుండా ఇతరులకు పరిహారం ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. అందరికీ పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పినా కొందరికే ఇచ్చారని అంటున్నారు.
నామ్‌కే వాస్తేగా..
వరదల అనంతరం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి బాధితుల లిస్టును తయారు చేసి కలెక్టర్‌కు పంపించారు. వారి లెక్కల ప్రకారం భద్రాచలంలో 2913 కుటుంబాలు నష్టపోయారు. అయితే 1431 మందికి మాత్రమే పరిహారం ఇచ్చారు. మిగిలిన 1482 మందికి బ్యాంకు అకౌంట్లు, ఐఎఫ్‌సీ కోడ్, ఆధార్ నెంబర్లు తప్పుగా ఉన్నాయనే కారణంతో ఇవ్వలేదు. వివరాలు మరోసారి ఇచ్చినా నేటికి పరిహారం రాలేదు. దుమ్ముగూడెంలో 2180 కుటుంబాలలో 244 కుటుంబాలకు, చర్లలో 60, వెంకటాపురంలో 110, వాజేడులో 142 కుటుంబాలకు పరిహారం రాలేదని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెబుతున్నారు. పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడులో 2 వేల కుటుంబాలకు పరిహారం రాలేదు. అశ్వాపురం మండలం నెల్లిపాక పంచాయతీలో పలువురికి పరిహారం రాకపోవడంతో వారు ఛలో కలెక్టరేట్ ప్రోగ్రాం చేపట్టారు. ఇదే మండలం ఆనందాపురం గ్రామంలో 75 ఇళ్లు వరదలో మునిగాయి. ఇప్పటికీ ఒక్క కుటుంబానికి కూడా పరిహారం ఇవ్వలేదు. చర్ల మండలంలోని వరద బాధితులు శుక్రవారం కలెక్టర్‌ను కొత్తగూడెంలో కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వే సరిగా చేయలేదని, ఇండ్లు మునగని వారికి పరిహారం ఇచ్చారని ఫిర్యాదు చేశారు. పినపాకలో వరద బాధితులు ఆల్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భద్రాచలంలో సబ్ కలెక్టరేట్‌ను బాధితులు ముట్టడించారు.
ఇంకెప్పుడు ఇస్తరు
వరదలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు పరిహారం ఇంకెప్పుడు ఇస్తారు. రీసర్వే చేసి తప్పులు దొర్లిన వారి వద్ద నుంచి వివరాలు తీసుకున్నారు. వారికి నష్ట పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు. అనేక సార్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదు. పరిహారం ఇవ్వకుండా సర్కారు చేతులెత్తేసింది. పరిహారం ఇవ్వకపోతే బాధితులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తాం.
- పొదెం వీరయ్య, ఎమ్మెల్యే
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం: ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి
భద్రాచలం, వెలుగు: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ ప్రెసిడెంట్, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అధ్యక్షతన శనివారం భద్రాచలంలో డీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య జిల్లాలో పార్టీని పటిష్టం చేశారని ప్రశంసించారు. నిఖార్సైన క్యాడర్ జిల్లాలో ఉందని అన్నారు. నిత్యావసర సరుకులు, డీజిల్,పెట్రోల్, గ్యాస్, విద్యుత్‌చార్జీల పెంపును నిరసిస్తూ సెప్టెంబరు 4న నిర్వహించ తలబెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో జిల్లా నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, యడవల్లి కృష్ణ,శౌరీ, జిల్లా కమిటీ సభ్యులు దేవి ప్రసన్న, చింతిరాల రవికుమార్, సోములు నాయక్, కోటేశ్వరరావు, నల్లపు దుర్గాప్రసాద్, బుడగం శ్రీనివాసరావు, జడ్పీటీసీలు సున్నం నాగమణి, ఇర్పా శాంత, ఎంపీపీ కోదండరామయ్య, బోగాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి హాస్టల్ స్టూడెంట్స్ కు ట్రంకు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు ఇవ్వలేదని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నామాల ఆజాద్, వి వెంకటేశ్ ఆరోపించారు. శనివారం స్టూడెంట్స్ ట్రంకు పెట్టెలు తలపై పెట్టుకుని, ప్లేట్లు పట్టుకొని పాత బస్టాండ్ నుంచి జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మురళి, సతీశ్, కార్తీక్, శివ, డి. రాంబాబు, కరణ్, పృథ్వీ, మల్సూర్, నిహారిక, జమున, కృష్ణకుమారి పాల్గొన్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
మధిర, వెలుగు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. మధిర మండలం దెందుకూరు, తొండలగోపవరం గ్రామాల మధ్య శనివారం ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కొనకాల రాధాకృష్ణ(30) చనిపోయాడు. శనివారం పొలానికి వెళ్లి వస్తుండగా అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఒక పాప ఉన్నారు. రూరల్ ఎస్సై నరేశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టేకులపల్లి: చేనుకు వెళ్తుండగా ట్రాక్టర్పల్టీ కొట్టడంతో మండలంలోని బొమ్మనపల్లికి చెందిన బానోత్ పాలనేత్ర(17) చనిపోయాడు. సుజాతనగర్ వేపలగడ్డ అబ్దుల్‌కలాం కాలేజీ డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తన చేనుకు ట్రాక్టర్ తీసుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భుక్యా శ్రీనివాస్ తెలిపారు.
బైక్ ఢీకొని..
దమ్మపేట: బైక్ ఢీకొని రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న భుక్యా వెంకటేశ్వరరావు(46) చనిపోయాడు. ఎస్సైశ్రవణ్ కుమార్ కథనం మేరకు.. మండలంలోని నాగులపల్లి గ్రామంలో పామ్ ఆయిల్ తోటకు వెళ్లి తిరిగి వస్తుండగా శుక్రవారం శొంటి నాగేందర్రావు వెనుక నుంచి బైక్ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు.
లారీ ఢీకొని..
చర్ల: మండలకేంద్రానికి చెందిన కట్టూరి రాఘవ(22) శనివారం ఉదయం అఖిల ఆసుపత్రి సమీపంలో రోడ్డు దాటుతుండగా, భద్రాచలం నుంచి చర్ల వెళ్తున్న లారీ ఢీ కొనడంతో చనిపోయాడు. మధిర పట్టణానికి చెందిన రాఘవ చర్ల జీపీకి అటెండర్‌గా ఇటీవలే బదిలీపై వచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మావోయిస్టులకు సహకరించొద్దు
గుండాల, వెలుగు: మావోయిస్టులకు సహకరించొద్దని సీఐ కరుణాకర్ సూచించారు. శనివారం మండలంలోని గిరిజన పల్లెల్లో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల వాల్ పోస్టర్స్ ను గోడలపై అంటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టులకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. మావోయిస్టుల సమాచారం ఇచ్చిన వారికి నగదు రివార్డు అందిస్తామని చెప్పారు.
71 కేజీల గంజాయి పట్టివేత
వైరా, వెలుగు: వైరా బస్టాండ్ లో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని 71 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రహమాన్, సీఐ సురేశ్, ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. వెస్ట్ ఢిల్లీకి చెందిన అర్పిత్కుమార్, పవన్‌కుమార్, అభిషేక్తమ బ్యాగుల్లో ఛత్తీస్ ఘడ్ నుంచి ఢిల్లీకి గంజాయిని తీసుకెళ్తున్నట్లు చెప్పారు. దీని విలువ రూ.10.67 లక్షలు ఉంటుందని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.
ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తేయాలి
కారేపల్లి,వెలుగు: ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తేయాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఆవుల అశోక్ డిమాండ్ చేశారు. పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శించారు. గుమ్మడి సందీప్, లక్ష్మీనారాయణ, భాస్కర్ పాల్గొన్నారు.
కేజీబీవీని సందర్శించిన డీఈవో
కారేపల్లి, వెలుగు: మండలకేంద్రంలోని కేజీబీవీని డీఈవో యాదయ్య శనివారం సందర్శించారు. స్కూల్లో నలుగురికి డెంగీ నిర్థారణ కావడంతో పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంఈవో బాలరాజు, సింగరేణి సర్పంచ్ స్రవంతి ఉన్నారు.
మెస్ చార్జీలు పెంచాలి
గుండాల, వెలుగు: మెస్ చార్జీలు పెంచాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని హాస్టల్స్, స్కూల్స్ ను సందర్శించి స్టూడెంట్స్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్స్ కు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సర్కార్ విఫలమైందని విమర్శించారు. రామకృష్ణ, రాజేశ్ పాల్గొన్నారు.
నేడు కానిస్టేబుల్ రాత పరీక్ష
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: టీఎస్ఎల్పీఆర్బీ, జెఎన్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. 105 పరీక్షా కేంద్రాలలో 39,551 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని చెబితే నమ్మొద్దని, ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సీపీతెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల రక్తదానం
ఖమ్మం టౌన్, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆర్టీసీ ఉద్యోగులు రక్తదానం చేశారు. శనివారం కొత్త బస్టాండ్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆర్ఎం ఈ ప్రభులత ప్రారంభించారు. రక్తదానం చేసిన విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగులను ఆమె అభినందించారు. డీఎం డి శంకర్రావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఏవీ గిరిసింహారావు, డిపో అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) వి గౌతమి, అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) పి శ్రీనివాస్, డిప్యూటీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి.రజిత పాల్గొన్నారు.