భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నష్టాన్ని మిగిల్చిన గోదావరి వరదలు

భద్రాచలం, వెలుగు: వరదలతో అతాలకుతలమైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రోడ్ల రిపేర్ల కోసం ప్రభుత్వం అరకొర నిధులిచ్చి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో జిల్లాలో గోదావరి వరదలు, వర్షాలు అంతులేని నష్టాన్ని మిగిల్చాయి. రికార్డు స్థాయిలో వరదలు రావడంతో పలు రహదారులు కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. ఆర్​అండ్​బీ ఇంజనీరింగ్​ శాఖ నష్టం అంచనాలు వేసి సర్కారుకు అందించింది. రూ.200 కోట్లతో ప్రపోజల్స్​ పంపితే సర్కారు ఆర్అండ్​బీకి కేవలం రూ.94 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. ఈ నిధులతో త్వరలో పనులు చేపడతామని ఆర్అండ్​బీ ఈఈ భీమ్లా తెలిపారు. 

ప్రతిపాదనలివే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరదలు, వర్షాలు వల్ల జరిగిన నష్టాన్ని నియోజకవర్గాల వారీగా ఆర్అండ్​బీ ఆఫీసర్లు అంచనా వేసి సర్కారుకు పంపించారు. ఖమ్మం నియోజకవర్గంలో రూ.4 కోట్లు, మధిరలో రూ.12.85 కోట్లు, వైరాలో రూ.6.41 కోట్లు, పాలేరులో రూ.55 లక్షలు, సత్తుపల్లిలో రూ.1.83 కోట్లు, అశ్వారావుపేటలో రూ.6.03 కోట్లు, భద్రాచలంలో రూ.2.00 కోట్లు, కొత్తగూడెంలో రూ.50 లక్షలు, పినపాకలో రూ.7.65 కోట్లు, ఇల్లందులో రూ.2.50 కోట్ల మేర వరదలతో రోడ్లు డ్యామేజ్​ అయినట్లుగా సర్కారుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. వీటితో పాటు యాన్యువల్​ మెయింటెనెన్స్, రిపేర్లు, ఇతరత్రా పనులతో కలిపి రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపించారు. వరదలతో భారీ నష్టం జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రూ.94 కోట్లు కేటాయించారు. వీటితో పూర్తి స్థాయిలో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బీటీ కొట్టుకుపోయిన దారులతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. 

భద్రాచలం డివిజన్​కు అరకొర నిధులే

గోదావరి వరదలకు ఆర్​అండ్​బీ రోడ్లు భద్రాచలం డివిజన్ లో భారీగా దెబ్బతిన్నాయి. బూర్గంపాడు–-ఏటూరునాగారం రోడ్డులో 14 కి.మీలు, భద్రాచలం–-చండ్రుపట్ల మధ్య 7 కి.మీలు, అశ్వాపురం-–మొండికుంట మధ్య 15 కి.మీలు, చర్ల–-పూసుగుప్ప మధ్య 3 కి.మీలు, 
మణుగూరు-–నెల్లిపాక మార్గంలో 16 కి.మీలు, బయ్యారం–-తాడ్వాయి మార్గంలో 6 కి.మీలు, గొమ్మూరు, సారపాక–-నెల్లిపాక మార్గంలో 5 కి.మీలు, సీతానగరం–-కుర్నపల్లి మధ్య 5 కి.మీలు దెబ్బతిన్నది. 8 రోడ్లు దెబ్బతింటే కేవలం 4 రోడ్లకు మాత్రమే నిధులు ఇచ్చి సర్కారు చేతులు దులుపుకుంది. మణుగూరు, బయ్యారం, గొమ్మూరు, -సారపాక, సీతానగరం, -కుర్నపల్లి రోడ్లకు నిధులు ఇవ్వలేదు. దీంతో ఈ రోడ్లపై ఎలా ప్రయాణించాలని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

పీఆర్​కు రూ.56.89 కోట్లు..

ఆర్అండ్​బీ రోడ్లతో పాటు పంచాయతీరాజ్​ రోడ్లు వరదలతో డ్యామేజ్​ అయ్యాయి. వాటిని గుర్తించి ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపించారు. రోడ్లు, బ్రిడ్జిల రిపేర్ల కోసం పంచాయతీరాజ్​ ఇంజనీరింగ్ విభాగానికి సర్కారు రూ.56.89 కోట్లు విడుదల చేసింది. ఇందులో గోదావరి వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలకు రూ.17 కోట్లు కేటాయించారు. 65.15 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఈ నిధులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53 పనులు చేపట్టనున్నారు. 20 రోడ్లు కొట్టుకుపోగా, 33 రోడ్ల బీటీ దెబ్బతిన్నాయని, 45 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని పీఆర్​ ఈఈ సుధాకర్​ తెలిపారు. 

గిరిజన ప్రాంతాలపై నిర్లక్ష్యం చేస్తున్రు

గోదావరి వరదలకు గిరిజన ప్రాంతాల్లోని రోడ్లు దెబ్బతిన్నాయి. సీతానగరం,-కుర్నపల్లి రోడ్డు పాడైపోయింది. కానీ ఎఫ్​డీఆర్​(ఫ్లడ్​ డ్యామేజ్​ రిపేర్) ఫండ్స్​ ఇవ్వడంలో తెలంగాణ సర్కారు వివక్ష చూపుతోంది. గిరిజనులు ఈ రోడ్డుపై నడవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

- కనుబుద్ది దేవ,దుమ్ముగూడెం