భద్రాచలం: ఎగువన కురుస్తోన్న వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవాహిస్తోంది. ఈ క్రమంలోనే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం (సెప్టెంబర్ 10) సాయంత్రం 48 అడుగులకు చేరిన గోదావరి.. ఇవాళ ఉదయం 50.6 అడుగులకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నది స్నానఘట్టాలు,కేశ ఖండన ప్రాంతం, సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి గుడి వద్దకు గోదావరి వరద నీరు చేరింది.
వరద ప్రవాహం 53 అడుగుల మార్క్‌ను టచ్ అయితే మూడో ప్రమాద హెచ్చరిక ఇష్యూ చేయనున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతంలోకి లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వరద ఉధృతి మరింత పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి తక్షణ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు.