గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు తరలి వచ్చే ఈ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిస్జ్తాత్మకంగా నిర్వహించనుంది. ఈ క్రమంలో స్థానిక నేతలు, సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ముందస్తు కార్యాచరణ కూడా సిద్దం చేశారు అధికారులు. ఈ సారి గోదావరి పుష్కరాల నిర్వహణ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్లు తెలుస్తోంది. పుష్కరాల నిర్వహణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం.
ముహూర్తం ఎప్పుడంటే:
జూలై 23, 2027 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. 2015 లో పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగుల్చాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి కోసం రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్ధం చేశారు అధికారులు.
అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేశారు. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా ఉండగా... మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు అధికారులు.
ముందస్తు ఏర్పాట్లు:
పుష్కరాల నిర్వహణ కోసం జిల్లాను యూనిట్‌గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. ఇప్పటి నుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లు చేపట్టామని మంత్రులు తెలిపారు.