భద్రాద్రి కొత్తగూడెం: భారీ వర్షాలతో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా వణికిపోతుంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పలు గ్రామాలు నీటమునిగాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండు కుండలా మారాయి. ప్రజల జీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 30.5 అడుగులకు చేరింది.
గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.దీంతో భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జలాశయాలు పూర్తి స్థాయిలో నిండు కుంటున్నాయి.మొన్నటి వరకు 10 అడుగుల వద్ద ఉన్న గోదావరి ఎగువ నుండి వస్తున్న వరద నీటితో స్వల్పంగా గోదావరి వద్ద వరద నీటి మట్టం పెరుగుతుంది. గోదావరి నది స్నానఘట్టాల వరకు వరద నీరు వచ్చి చేరింది.ఇసుక తిన్నెలు అన్ని వరద నీటిలో మునిగాయి.శనివారం (జూలై 20) ఉదయం 31 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తున్న గోదావరి వరద నీరు.స్నానఘట్టాల వరకు వరద నీరు వచ్చి చేరింది.
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఛత్తీస్ఘడ్లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి వరద పోటెత్తింది. శనివారం ఉదయం ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 66వేల 900 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేసిన అధికారులు.43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.