వరద గోదారి..కాళేశ్వరం దగ్గర ఉగ్ర రూపం..భద్రాచలం వద్ద రెండో హెచ్చరిక జారీ

వరద గోదారి..కాళేశ్వరం దగ్గర ఉగ్ర రూపం..భద్రాచలం వద్ద రెండో హెచ్చరిక జారీ
  •     మేడిగడ్డ బ్యారేజీ వద్ద 9.54, సమ్మక్కసాగర్ దగ్గర 10.15  లక్షల క్యూసెక్కుల అవుట్‌‌ ఫ్లో 
  •     48.8 అడుగులకు చేరుకున్న నది 
  •      మంగళవారం 54 అడుగుల వరకూ వచ్చే అవకాశం 
  •      సురక్షిత ప్రాంతాలకు ముంపు గ్రామాల ప్రజల తరలింపు
  •      ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఆంధ్రాలకు స్తంభించిన రవాణా  

జయశంకర్‌‌ భూపాలపల్లి/భద్రాచలం, వెలుగు : గోదావరి నది  ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి, ములుగు, భద్రాచలం జిల్లాల్లో డేంజర్‌‌ బెల్స్‌‌ మోగిస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు వంటి ఉపనదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో గోదావరి వరద గంట గంటకూ పెరిగిపోతోంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌ రెస్య్కూ టీంలను ఆఫీసర్లు రంగంలోకి దించారు. ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క ముల్లకట్ట బ్రిడ్జి వద్ద గోదారమ్మకు ప్ర్యతేక పూజలు చేశారు. ములుగు జిల్లాలోని ఐదు మండలాల్లో పర్యటించి ఆఫీసర్లను అలర్ట్‌ చేశారు. 

పెరుగుతున్న వరద

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీ నుంచి వరద మొదలైంది. దీనికితోడు ప్రాణహిత నది నుంచి వరద పోటెత్తడంతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 13 మీటర్ల హైట్ తో ప్రవహిస్తోంది. దీంతో ఆఫీసర్లు  మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద సోమవారం ఉదయం 6.5 లక్షల క్యుసెక్కుల ఇన్‌‌ఫ్లో ఉంటే సాయంత్రానికి 9.54  లక్షల క్యుసెక్కులకు చేరింది. బ్యారేజీకి ఉన్న మొత్తం 85 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగానే కిందికి పంపిస్తున్నారు.

దమ్మూరు వద్ద ఇంద్రావతి గోదావరిలో కలుస్తుండడంతో వరద ఉధృతి ఎక్కువై పలిమెల మండలంలోని గిరిజన గ్రామాలకు వాగులు వంకలు చేరాయి. దీంతో ఆఫీసర్లు ప్రజలను అప్రమత్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ దగ్గర 10.15 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌, అవుట్‌‌ ఫ్లో ఉందని ఆఫీసర్లు ప్రకటించారు. 

మూడు జిల్లాల్లో రెడ్​ అలర్ట్​

గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భూపాలపల్లి, ములుగు, భద్రాచలం జిల్లాల్లో రెడ్‌‌ అలర్ట్‌‌ ప్రకటించారు. భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌‌పూర్‌‌, పలిమెల, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, భద్రాచలం జిల్లాలోని తీర ప్రాంతంలోని భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాల ప్రజలు మరో 36 గంటల పాటు ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప ఇండ్లు దాటి బయటకు రావొద్దని హెచ్చరించారు. ముంపుకు గురైన గ్రామాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని వారిని పునరావాస  కేంద్రాలకు తరలిస్తున్నారు.  

గోదారమ్మకు మంత్రి సీతక్క పూజలు

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట  బ్రిడ్జి వద్ద గోదావరి వరద ఉధృతిని మంత్రి సీతక్క పరిశీలించారు. ఏటూరునాగారం నుంచి వాజేడు మండల పర్యటనకు వెళ్తున్న మంత్రి వంతెనపై కాసేపు ఆగి నదిలో పసుపు, కుంకుమ, పూలు వేసి కొబ్బరికాయ కొట్టి వరద ఉధృతి శాంతించాలని పూజలు చేశారు. 

భద్రాచలం వద్ద 11 లక్షల క్యూసెక్కుల వరద

భద్రాచలం వద్ద సోమవారం 2.01 గంటల సమయంలో గోదావరి 48 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు 48.8 అడుగుల వద్ద 11,82,547 క్యూసెక్కుల వరద దిగువకు పోతోంది. ఎగువన ప్రాణహిత, తాలిపేరు నుంచి వస్తున్న వరదతో అంతకంతకూ నీటిమట్టం పెరుగుతోంది. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు నుంచి 46,612 క్యూసెక్కుల నీళ్లను గోదావరిలోకి వదులుతున్నారు. దిగువన శబరి ఉపనది శాంతించడం ఊరటనిచ్చే అంశం.

కానీ, మంగళవారం ఉదయం నాటికి గోదావరి 54 అడుగుల వరకు వచ్చే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ ఫోర్​కాస్ట్ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాచలం మన్యంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న పినపాక, మణుగూరు ,అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం ,దుమ్ముగూడెం, చర్ల మండలాల సెక్టోరియల్​ఆఫీసర్లను కలెక్టర్​ అలర్ట్ చేశారు. చర్లలో 26, దుమ్ముగూడెంలో 51, బూర్గంపాడులో 5, అశ్వాపురంలో 11

మణుగూరులో 6, పినపాకలో 10 గ్రామాలు వరద ముంపుకు గురయ్యే అవకాశాలుండడంతో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భద్రాచలం నుంచి కూనవరం, భద్రాచలం టు చింతూరు మధ్య రోడ్లపైకి వరద చేరింది. ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఆంధ్రాలకు రవాణా వ్యవస్థ స్తంభించింది.