భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లాతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. జులై 20వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు 41.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. సాయంత్రం 3.30 గంటలకు 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే గోదావరి నుంచి 9,32,228 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నందున ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లా యంత్రాంగపు సలహాలు, సూచనలను ప్రజలు పాటించాలని ఆధికారులు కోరుతున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. ఇళ్ల నుంచి బయటకి రావొద్దని హెచ్చరించారు.
గోదావరి వరద ఉద్ధృతి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. 24 గంటలు పనిచేసేలా కలెక్టరేట్‌తో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాలు.. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచించారు. అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.