బాసర నుంచి భద్రాచలం దాకా మురికికూపంలా గోదావరి

  • ముక్కుమూసుకుంటే తప్ప మునకవేయలేని పరిస్థితి 
  • పొరపాటున నీళ్లు మింగితే లేని రోగాలు
  • దేవుళ్ల చక్రస్నానాలు, తెప్పోత్సవాలు సైతం కలుషిత నీటిలోనే 
  • భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా పట్టించుకోని సర్కారు

నెట్​వర్క్​, వెలుగు : ఒకప్పుడు తెలివాహ(తెల్లని ప్రవాహం) అని పిలిపించుకున్న పవిత్ర గోదావరి, ఇప్పుడు మురికికూపంలా మారింది. బాసర నుంచి భద్రాచలం దాకా నాలాల నుంచి వచ్చి కలిసే డ్రైనేజీ నీళ్లు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్​వాటర్, డంపుయార్డుల నుంచి కొట్టుకొచ్చే చెత్తాచెదారం కలిసి  కంపుకొడ్తున్నది. దీంతో నదీతీరాన వివిధ దేవస్థానాలకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలకు జంకుతున్నారు. నదిలో మునక వేస్తే పుణ్యం సంగతేమోగానీ  లేని రోగాలు వస్తున్నాయని వాపోతున్నారు. కాసేపు నీటిలో ఉంటే చర్మవ్యాధులు రావడమేకాదు, పొరపాటున నీళ్లు మింగితే వాంతులు, విరేచనాలు చేసుకుంటున్నారు. 

గోదావరిలోకి 50కిపైగా డ్రైనేజీలు.. 

బాసర, కోటిలింగాల, ధర్మపురి, గూడెం, భద్రాద్రి లాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ గోదావరి వెంటే ఉన్నాయి.ఈ నదీ తీరాలన్నీ పుణ్యస్నానాలకు ఫేమస్. దేవస్థానాలకు వచ్చే భక్తులతో పాటు పండుగలు, పబ్బాలు, కర్మకాండలు, పిండ ప్రదానాలకు వచ్చేవాళ్లు ఇక్కడే పుణ్యస్నానాలు చేస్తుంటారు. కానీ బాసర నుంచి భద్రాద్రి వరకు ఏకంగా 50కిపైగా నాలాల ద్వారా డ్రైనేజీ వాటర్​గోదావరిలో కలుస్తోంది. రోజుకు కనీసం 200 ఎంఎల్​డీ(మిలియన్ లీటర్స్ పర్​డే) మురుగు శుద్ధి చేయకుండానే నదిలోకి వదులుతున్నారు. వివిధ లిక్కర్, విద్యుత్, సింగరేణి, సిరామిక్స్, పేపర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్​వాటర్​కూడా నేరుగా నదిలో కలుస్తున్నాయి. దీనికితోడు నదికిరువైపులా సర్కారే డంపింగ్​ యార్డులు పెట్టి   టన్నులకొద్దీ చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను కుప్పలుగా పోయిస్తోంది.

ఫలితంగా ఆయా ఏరియాల్లో గోదావరి వాటర్​నల్లరంగులోకి మారి దుర్వాసన వస్తుండడంతో ముక్కుమూసుకోకుండా నిలబడలేని పరిస్థితి ఉంది. ఈ నీళ్లను పశువులు కూడా తాగడం లేదు. అలాంటి నీటిలో భక్తులు స్నానం చేయాల్సిన పరిస్థితి. ఇంకా ఆ నీళ్లలోనే దేవుళ్లకు చక్రస్నానాలు, తెప్పోత్సవాలు నిర్వహిస్తుండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అన్నిచోట్ల సీవరేజ్​ ట్రీట్​మెంట్​ప్లాంట్లను ఏర్పాటుచేసి శుద్ధి చేశాకే మురికినీటిని నదిలోకి వదలాల్సి ఉన్నప్పటికీ సర్కారు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.  

బాసర : మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకాలోని లిక్కర్​​ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్ బాసర వద్ద గోదావరిలో నేరుగా కలుస్తున్నాయి. ఏడాదంతా నిల్వ ఉంచిన కెమికల్స్​ను ఆయా కంపెనీలు వర్షాకాలంలో దిగువకు వదిలిపెడుతున్నాయి. దీంతో వరద బంద్​ కాగానే సుమారు 12 కిలోమీటర్ల మేర నది నురుగలతో నిండిపోయి కలుషితమవుతోంది. పశువులు కూడా నీళ్లు తాగని ఆ చోటే భక్తులు స్నానాలు చేయాల్సిన దుస్థితి ఉంది.

భద్రాచలం : భద్రాచలం ఎగువన తాళ్లగొమ్మూరు వద్ద ఐటీసీ పేపర్​ ఇండస్ట్రీతోపాటు వివిధ పరిశ్రమల నుంచి సుమారు 40 రకాల  కెమికల్స్​నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి. పట్టణంలోని మెయిన్​ డ్రైన్​ను కూడా నదిలోకే మళ్లిస్తున్నారు. ఆ నీళ్లలోనే శ్రీరామచంద్రస్వామికి చక్రస్నానాలు, తెప్పోత్సవాలు నిర్వహిస్తుండడంపై భక్తులు మండిపడ్తున్నారు.

గోదావరిఖని, మంచిర్యాల : రామగుండం కార్పొరేషన్​లోని నాలుగు మెయిన్​నాలాలతో పాటు లక్సెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్​, చెన్నూర్​ మున్సిపాలిటీల నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్​ నేరుగా గోదావరిలో కలుస్తోంది. వివిధ పవర్​ ప్లాంట్లు, సిరామిక్స్​ పరిశ్రమలు, ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్టుల  నుంచి వచ్చే కెమికల్​ వేస్టేజీని నదిలోకే వదులుతున్నారు. ఆయా మున్సిపాలిటీలకు గోదావరే డంప్​యార్డుగా మారింది. మరో గత్యంతరం లేక జనం ఈ మురికినీటిలోనే పుణ్యస్నానాలు కానిస్తున్నారు.  

 

ధర్మపురి, కోటిలింగాల, గూడెం : జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల, గూడెం తీరాలు ఒకప్పుడు పుణ్యస్నానాలకు ఫేమస్​. కానీ  ధర్మపురి పట్టణంలోని డ్రైనేజీ వాటర్​, చెత్తాచెదారం నదిలో కలుస్తుండడం, ఎల్లంపల్లి కారణంగా ఆ వేస్టేజీ ఎటూ కదలకపోవడంతో మురికికూపంలా మారింది. ఇప్పుడిక్కడ స్నానం అంటేనే భక్తులు వణుకుతున్నారు.