అళగేశన్​పై జీఆర్ఎంబీ ఉద్యోగుల ఫిర్యాదు

అళగేశన్​పై జీఆర్ఎంబీ ఉద్యోగుల ఫిర్యాదు
  • మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణ

హైదరాబాద్​, వెలుగు: గోదావరి రివర్ మేనేజ్​మెంట్​బోర్డు (జీఆర్ఎంబీ)మెంబర్​సెక్రటరీ అళగేశన్​పై బోర్డు ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగులతో అళగేశన్ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి శుక్రవారం లెటర్ రాశారు. ముఖ్యంగా మహిళా అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తూ వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకుని మహిళల గౌరవాన్ని కాపాడాలని ఫిర్యాదులో కోరారు. పని పేరుతో తన చాంబర్​కు పిలిపించుకుని గంటల తరబడి కూర్చోబెట్టుకునేవారని వాపోయారు.

మహిళా అధికారుల డ్రెస్సింగ్​పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారని అన్నారు. తనపై లైంగిక ఆరోపణల కేసులున్నాయని, విజిలెన్స్​కేసులు పెండింగ్​లో ఉన్నాయంటూ మీటింగుల్లోనూ, జీఆర్ఎంబీ క్లాసుల్లోనూ ఆయన ఓపెన్​గా చెప్పేవారని వివరించారు. ఆయన వేధింపుల గురించి జీఆర్ఎంబీ చైర్మన్​కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అడుగడుగునా నిఘా 

అళగేశన్​పై ఇటీవల సీడబ్ల్యూసీ చైర్మన్​కు ఈఎన్సీ జనరల్​ ద్వారా ఫిర్యాదు చేశామని బోర్డు ఉద్యోగులు ఫిర్యాదు కాపీలో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగుల లీవులు, ఎక్స్​టెన్షన్​, ఇంక్రిమెంట్​ను ఇవ్వకుండా టార్చర్​ చేశారని ఆరోపించారు. అధికారుల చాంబర్లలో సీసీ కెమెరాలు అవసరం లేదని ఇంటర్నల్​ కంప్లైంట్స్​ కమిటీ చెప్పినా.. దురుద్దేశంతో సీసీ కెమెరాలు పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అడుగడుగునా నిఘా పెడుతున్నారని ఆరోపించారు. కొందరు ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులతో అధికారుల ప్రతి కదలికలను తెలుసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. 

జీఆర్ఎంబీని తన సొంత ఎస్టేట్​గా మార్చేసి అళగేశన్​ రూల్స్​ పెట్టారన్నారు. వీటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఉద్యోగులకు అళగేశన్ మెమోలు జారీ చేసి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వేరే చోటుకు బదిలీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శిని బోర్డు ఉద్యోగులు ఫిర్యాదు లేఖ ద్వారా  కోరారు.