కందకుర్తి దగ్గర గోదావరి ఉగ్రరూపం.. తెలంగాణ–మహారాష్ట్రల మధ్య రాకపోకలు బంద్

కందకుర్తి దగ్గర గోదావరి ఉగ్రరూపం.. తెలంగాణ–మహారాష్ట్రల మధ్య రాకపోకలు బంద్

 నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తడంతో కందకుర్తి వద్ద అంతరాష్ట్ర బ్రిడ్జికి ఆనుకుని గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ రోజు ( సెప్టెంబర్​ 3) రాత్రి వరకూ మరింత ఉధృతి పెరిగి బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తెలంగాణ.. -మహారాష్ట్రల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు గోదావరి వైపుకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఈ సమయంలో ఎవరూ కూడా గోదావరి నదిని దాటేందుకు ప్రయత్నాలు చేయవద్దని నది పరివాహక ప్రాంతాల గ్రామస్థులకు హెచ్చరికలు జారీ చేశారు.

మహారాష్ట్ర లో విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో కందకుర్తి వద్ద గోదావరి ఉగ్రంగా ప్రవహిస్తోంది. తెలంగాణలో గోదావరి ప్రవేశించే కందకుర్తి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇంకా  వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. కందకుర్తి వద్ద శివాలయం నీట మునిగింది.