డిసెంబర్ నెలలో.. గోదావరి సెకండ్​ ఫేజ్​

డిసెంబర్ నెలలో.. గోదావరి సెకండ్​ ఫేజ్​
  • తొలివారంలో ప్రారంభించనున్న  సీఎం రేవంత్ రెడ్డి  
  • మల్లన్నసాగర్ నుంచే నీటి తరలింపు 
  • 15 టీంఎంసీలు తాగడానికి.. మరో 5 టీఎంసీలు మూసీ శుద్ధికి
  • డీపీఆర్​ సిద్ధం చేసిన అధికారులు రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తి!

హైదరాబాద్​సిటీ, వెలుగు:హైదరాబాద్ సిటీ తాగునీటి సరఫరా మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే గోదావరి రెండో దశ పనులకు గ్రీన్​ సిగ్నల్ ​ఇచ్చింది. అయితే, నీటిని కొండపోచమ్మ సాగర్ ​లేదా మల్లన్న సాగర్​రిజర్వాయర్​ల్లోకి.. అక్కడ్నుంచి తరలించాలన్నదానిపై కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొంది. తాజాగా సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మల్లన్నసాగర్​ నుంచే నీటిని తరలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గోదావరి రెండో దశ పనులకు రూ.5,560 కోట్లను కేటాయించారు.

ఈ పథకం ద్వారా సిటీకి అదనపు జలాలను తరలించడంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్  జలాశయాల్లో నీటి నిల్వ కు చర్యలు తీసుకోనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో ఈ పనులు పూర్తి చేస్తారు. ఇప్పటికే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్–-1 ద్వారా సిటీ తాగునీటి అవసరాల కోసం మెట్రోవాటర్​ బోర్డు ఎల్లంపల్లి నుంచి 10 టీఎంసీల నీరు తీసుకొస్తోంది. రెండో దశ పనుల ద్వారా మరో 20 టీఎంసీలను తరలించేందుకు ప్లాన్ ​చేసింది. ఇందులో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో గోదావరి రెండోదశ పనులకు సీఎం శంకుస్థాపన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 రెండేండ్లలో పూర్తి చేసేలా..

గోదావరి రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్​ను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో పంప్ హౌజ్ లు, సబ్ స్టేషన్లతోపాటు మల్లన్న సాగర్ నుంచి ఘన్ పూర్ వరకు 3,600 ఎంఎం డయా భారీ పైపు లైన్ నిర్మించనున్నారు. ఘన్ పూర్, శామీర్ పేట్ వద్ద 780 ఎంఎల్డీల కెపాసిటీతో నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించనున్నారు. ఘన్ పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేండ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read : రెండు నెలల్లో శ్రీశైలం సగం ఖాళీ

జంట జలాశయాలను ​నింపి

గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -1 ద్వారా ప్రస్తుతం నగరానికి రోజుకు 163 ఎంజీడీల ను సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని ప్రధాన ప్రాజెక్టుల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. 2030 వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని170 ఎంజీడీల అదనపు జలాల్ని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అందులో భాగం గా రెండో దశ ప్రాజెక్టు ద్వారా 20 టీఎంసీలను సేకరించాలని అనుకుం టోంది. ఇందులో 15 టీఎంసీలు మహానగర తాగునీటి అవసరాలకు కాగా, మరో 5 టీఎంసీలను జంట జలాశయాలై న ఉస్మాన్​సాగర్​, హిమాయత్​ సాగర్​లలో నిల్వచేసి మూసీ శుద్ధికి వినియోగించ నున్నట్టు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.