ఉధృతంగానే గోదావరి.. అడవుల్లోకి పోలవరం ముంపు బాధితులు

  • కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక 
  • 55.60 అడుగులు దాటిన ప్రవాహం

భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్నది. మూడో ప్రమాద హెచ్చరికను దాటి 55.60 అడుగుల మేర ప్రవాహం ఉన్నది. అయితే ఎగువన వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి తగ్గుముఖం పడుతున్నది. దీంతో క్రమంగా వరద తగ్గే అవకాశం ఉండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత పల్లెలు ఊపిరి పీల్చుకున్నాయి. 

జిల్లాలోని 62 గ్రామాలకు చెందిన 13,056 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. విజయవాడ–జగదల్​పూర్ జాతీయ రహదారిపై భద్రాచలం వద్ద రోడ్డు పైనుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో ఈ రూట్​లో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం-–పేరూరు హైవేలోనూ కుదునూరు, గంగోలు, తూరుబాకల వద్ద రోడ్డు పైనుంచి వరద వస్తున్నది. కాగా, దుమ్ముగూడెం మండలం సీతారాంపురం వద్ద గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం దొరికింది. 

అడవుల్లోకి పోలవరం ముంపు బాధితులు..
పోలవరం ముంపు మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. గోదావరి–శబరి సంగమ ప్రదేశం కూనవరంలో శబరి వంతెన పైకి వరద వచ్చింది. దీంతో మండల కేంద్రంలోకి వరద చేరింది. కూనవరం, టేకులబోరు గ్రామాలను ఖాళీ చేసిన బాధితులు.. బోదునూరు అటవీ ప్రాంతంలో గుడారాలు వేసుకుని ఉంటున్నారు. బుడ్డి దీపాలతో బాధితులు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఉండడానికి సరైన వసతిలేక, తినడానికి తిండి లేక పిల్లాపాపలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.