ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో మోసం..రూ. 57.13 లక్షలు మోసపోయిన వ్యక్తి

ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో మోసం..రూ. 57.13 లక్షలు మోసపోయిన వ్యక్తి
  • అకౌంట్‌‌ హోల్డర్‌‌ అరెస్ట్‌‌, పరారీలో అసలు నిందితుడు

గోదావరిఖని, వెలుగు : ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో సైబర్‌‌ మోసగాళ్లు ఓ వ్యక్తిని నమ్మించి రూ. 57.13 లక్షలు కొట్టేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే సైబర్‌‌ నేరగాళ్లకు అకౌంట్‌‌ ఇచ్చిన వ్యక్తిని గురువారం పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. రామగుండం కమిషనరేట్‌‌ సైబర్‌‌ క్రైమ్‌‌ డీఎస్పీ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖనిలో ఓ ప్రైవేట్‌‌ కాలేజీలో లెక్చరర్‌‌గా పనిచేసే వ్యక్తి స్టాక్‌‌ మార్కెట్‌‌లో ట్రేడింగ్‌‌ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో 2024 జులైలో అతడి వాట్సప్‌‌కు ట్రేడింగ్‌‌కు సంబంధించిన ఓ మెసేజ్‌‌ వచ్చింది.

దానిపై క్లిక్‌‌ చేయగానే అతడి నంబర్‌‌ ఓ గ్రూప్‌‌లో యాడ్‌‌ అయింది. తర్వాత ట్రేడింగ్‌‌లో డబ్బులు పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించడంతో సదరు వ్యక్తి ఐదు నెలల్లోనే పలు విడతలుగా రూ. 57.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఆ డబ్బులను విత్‌‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి గతేడాది నవంబర్‌‌ 1న రామగుండం సైబర్‌‌ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసిన డీఎస్పీ వెంకటరమణ, ఇన్స్‌‌పెక్టర్‌‌ కృష్ణమూర్తి, సైబర్‌‌ క్రైమ్‌‌ సిబ్బంది ఎంక్వైరీ మొదలు పెట్టారు. సదరు లెక్చరర్‌‌ డబ్బులు ట్రాన్స్‌‌ఫర్‌‌ చేసిన అకౌంట్‌‌ మహారాష్ట్రలోని ఓల్డ్‌‌ అహ్మద్‌‌నగర్‌‌ జిల్లా రహతా మండలం నపవాడి గ్రామానికి చెందిన శుభం నవనాథ్‌‌ షిల్కే పేరున ఉన్నట్లు గుర్తించి అతడిని పట్టుకున్నారు.

అతడిని విచారించగా.. టెలిగ్రామ్‌‌లో పరిచయమైన ఓ వ్యక్తికి తన బ్యాంక్‌‌ అకౌంట్‌‌ పాస్‌‌బుక్‌‌, ఏటీఎం ఇచ్చానని, తన అకౌంట్‌‌ వాడుకున్నందుకు సదరు వ్యక్తి నెలకు రూ. 5 వేల కమీషన్‌‌ ఇస్తున్నాడని ఒప్పుకున్నాడు. దీంతో నవనాథ్‌‌ షిల్కేను అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌ తరలించారు. లెక్చరర్‌‌ను మోసం చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.