కల్తీ కల్లే ఇద్దరి ప్రాణాలు తీసిందా ?

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని ఇందిరానగర్‌‌‌‌ వద్ద ఉన్న ఒకటో నంబర్​ కల్లు డిపో సమీపంలో బుధవారం రాత్రి చనిపోయిన ఇద్దరు కూలీల మరణానికి కల్తీ కల్లే కారణమై ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. కల్లు తాగి బయటకు వచ్చిన కొద్దిసేపటికే  మామిడి రమేశ్‌‌‌‌ (50), నాంపల్లి నవీన్‌‌‌‌ (23) కుప్పకూలి మరణించడంతో  కల్తీ కోణంలో లా అండ్​ ఆర్డర్‌‌, ఎక్సైజ్‌‌‌‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎక్సైజ్‌‌‌‌ సీఐ రమేశ్‌‌‌‌ ఆధ్వర్యంలో డిపోలోని కల్లు శాంపిల్స్​సేకరించి వరంగల్‌‌‌‌లోని ల్యాబ్‌‌‌‌కు పంపించారు. అలాగే, మృతదేహాలకు పోస్ట్‌‌‌‌మార్టమ్‌‌‌‌ నిర్వహించాక వారు తాగిన కల్లు ఆనవాళ్లను సేకరించిన పోలీసులు హైదరాబాద్‌‌‌‌లోని ల్యాబ్‌‌‌‌కు తరలించారు.

ఇదిలా ఉండగా శుక్రవారం ఇందిరానగర్‌‌‌‌ కల్లు డిపోతో పాటు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కల్లు గీత సొసైటీల ఆధ్వర్యంలో నడిచే కల్లు దుకాణాలన్నింటినీ మూసివేశారు. మృతుడు రమేశ్‌‌‌‌ కొడుకు అవినాశ్‌‌‌‌ ఫిర్యాదు మేరకు ఇందిరానగర్‌‌‌‌ కల్లు డిపోకు చెందిన సొసైటీ డైరెక్టర్లు, సభ్యులపై గోదావరిఖని వన్‌‌‌‌టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో కేసు నమోదు చేశారు. మృతదేహాలను భద్రపరిచిన గవర్నమెంట్‌‌‌‌ జనరల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ వద్ద, కల్లు డిపోల వద్ద, మృతుల కుటుంబీకుల ఇండ్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇన్​స్పెక్టర్లు ప్రమోద్‌‌‌‌రావు, ప్రసాదరావు, చంద్రశేఖర్‌‌‌‌, ఎస్‌‌‌‌ఐలు బందోభస్తు ఏర్పాటు చేశారు. రమేశ్‌‌‌‌ అంత్యక్రియలు గోదావరినది ఒడ్డున జరగగా, నవీన్‌‌‌‌ మృతదేహాన్ని స్వగ్రామం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ మండలం గన్నారం తరలించారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌ రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. కాంగ్రెస్‌‌‌‌, సీపీఐ లీడర్లు మహంకాళి స్వామి, పాతిపెల్లి ఎల్లయ్య, తిప్పారపు శ్రీనివాస్‌‌‌‌, గట్ల రమేశ్‌‌‌‌, కె.కనకరాజ్‌‌‌‌, మార్కపురి సూర్య, మద్దెల దినేశ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అంత్యక్రియల కోసం రెండు కుటుంబాలకు సొసైటీ  సభ్యుల నుంచి రూ.50 వేల చొప్పున ఇప్పించారు.

డిపోల్లోనే కల్లు తయారీ ?

గోదావరిఖనిలో రెండు కల్లు గీత సొసైటీలు పనిచేస్తుండగా, ఒకటో నంబర్​సొసైటీ ఆధ్వర్యంలో ఇందిరానగర్‌‌‌‌, గోదావరిఖని కూరగాయల మార్కెట్‌‌‌‌, ఫైవింక్లయిన్‌‌‌‌ చౌరస్తా కల్లు దుకాణాలు నడుస్తున్నాయి. వీటికి ఇందిరానగర్‌‌‌‌ డిపో నుంచే కల్లు సప్లై అవుతోంది. రెండో నంబర్​సొసైటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ సమీపంలో, ఎన్టీపీసీ కాజీపల్లి వద్ద దుకాణాలు నడుస్తుండగా, వీటికి కాజీపల్లి డిపో నుంచి కల్లు పంపిస్తారు. చుట్టుపక్కల గ్రామాల్లోని చెట్ల నుంచి సేకరించిన కల్లును దుకాణాలకు తరలిస్తారని పైకి చెబుతున్నా...లోపల మాత్రం డిపోల్లోనే కల్లు తయారు చేస్తారనేది జగమెరిగిన సత్యం.

కల్లు డిపోల్లో సిమెంట్‌‌‌‌ గోళాలు, ప్లాస్టిక్‌‌‌‌ డ్రమ్ములు, ఇతర వస్తువులు కనిపిస్తుండడంతో ఇక్కడే కల్లు తయారు చేస్తారనేది స్పష్టమవుతున్నది. కల్లు తయారీలో మత్తును కలిగించే కొన్ని కెమికల్స్, పదార్థాలను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో కల్లు తయారీలో డైజోఫామ్‌‌‌‌ను కలపగా, గత ప్రభుత్వం సీరియస్‌‌‌‌గా తీసుకోవడంతో దాని స్థానంలో మత్తు, నిద్ర వచ్చేలా చేసే అల్ప్రాజోలం, మత్తు ఎక్కువై పైకిలేవకుండా చేసే క్లోరోఫామ్‌‌‌‌తో కూడిన వైట్‌‌‌‌ ఫేస్ట్‌‌‌‌ రూపంలో ఉన్న కెమికల్​ను కలుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. దీన్ని తాగి మత్తుకు అలవాటు పడిన వారు రోజూ ఇదే కల్లును తాగడానికి వస్తుంటారని తెలుస్తోంది. కల్లు తక్కువ ధరకు రావడంతో పాటు మత్తు ఎక్కువగా ఉండడంతో కూలి పనులు చేసుకునేవారు దీనికి బానిసలవుతున్నారు. 

 మోతాదు మించడంతోనే..  

మామిడి రమేశ్‌‌‌‌, నాంపల్లి నవీన్‌‌‌‌ ఇద్దరు ఓ మేస్త్రీ దగ్గర ఇండ్ల నిర్మాణ పనుల్లో ఏడాదిగా కూలీలుగా పని చేస్తున్నారు. ఇందిరానగర్‌‌‌‌ కల్లు డిపోకు సమీపంలోనే ఓ ఇంటి నిర్మాణంలో పనిచేస్తున్న వీరు బుధవారం మధ్యాహ్నం సమీపంలోని కల్లు డిపోకు వెళ్లి కల్లు తాగి వచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు కూడా వెళ్లి మళ్లీ తాగారు. సాయంత్రం 6.30 గంటలకు బయటకు వచ్చి డిపోకు సుమారు 400 మీటర్ల దూరంలో రోడ్డుపై పడిపోయారు. ఎంతకూ లేవకపోవడంతో కుటుంబసభ్యులు సమాచారం తెలుసుకుని గోదావరిఖని గవర్నమెంట్‌‌‌‌ జనరల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చనిపోయారు. సొసైటీల ఆధ్వర్యంలో నడిచే డిపోల్లో తయారు చేసే కల్లులో అల్ప్రాజోలం, క్లోరోఫామ్‌‌‌‌ మోతాదు మించిపోవడం వల్లే ఇద్దరు చనిపోయారని పలు సంఘాల బాధ్యులు ఆరోపించారు. డిపో బాధ్యులపై క్రిమినల్‌‌‌‌ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌ లీడర్‌‌‌‌ మహంకాళి స్వామి డిమాండ్‌‌‌‌ చేశారు. స్థానిక ఎక్సైజ్‌‌‌‌ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు.