![ఎన్టీపీసీ పొగ, దుమ్ముతో బతకలేకపోతున్నం!](https://static.v6velugu.com/uploads/2025/02/godavrikahani-ntpc-dust-pollution_p9vxoSyEX3.jpg)
- ‘ఖని’ మాతంగి కాలనీవాసుల ఆందోళన
- వేరే ప్రాంతానికి తరలించాలని వేడుకోలు
- అయినా పట్టించుకోని ఎన్టీపీసీ మేనేజ్ మెంట్
- ఇష్యూను పార్లమెంట్లో ప్రస్తావించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- మాతంగి కాలనీని తరలించాలి
- పార్లమెంటులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎన్టీపీసీ వెదజల్లే కాలుష్యంతో మాతంగి కాలనీ వాసులు సతమతమవుతున్నారు. రోగాల బారిన పడుతున్నామని, తమ కాలనీని తరలించాలని కోరుతున్నారు. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా 1,600 మెగావాట్ల ప్లాంట్ఇప్పటికే ప్లాంటును నిర్మించారు.
తాజాగా మరో 2,400 మెగావాట్ల పవర్ప్లాంట్ఏర్పాటుకు ఇటీవలే పబ్లిక్హియరింగ్నిర్వహించారు. ఇప్పటికే ఏర్పాటైన ప్లాంటు నుంచి వచ్చే కాలుష్యంతో తట్టుకోలేకపోతున్నామని, ఇక కొత్త ప్లాంట్కూడా మొదలైతే బతకడం కష్టమని, మరో చోటకు తరలించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.
మరోవైపు కాలుష్యంపై ఎన్టీపీసీ మేనేజ్మెంట్నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కాగా.. మాతంగి కాలనీని సురక్షిత ప్రాంతానికి తరలించి, ఆర్అండ్ఆర్ప్యాకేజీ వర్తింపజేసి ఆదుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో మాట్లాడారు. అదేవిధంగా ఇటీవల జరిగిన పబ్లిక్ హియరింగ్లోనూ కాలనీ వాసుల ఇబ్బందులపైనా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ప్రస్తావిస్తూ.. ఆదుకునేలా ఎన్టీపీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో 4 వేల మెగావాట్లతో ప్లాంట్లు
2014 లో తెలంగాణ ఏర్పాటు తర్వాత 4 వేల మెగావాట్ల విద్యుత్‌ప్లాంట్లను ఎన్టీపీసీ నిర్మించాలని పునర్విభజ న చట్టంలో పొందుపరిచారు. అందుకనుగుణంగా రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ఆవరణలోని ఖాళీ జాగాలో 2017లో ఫస్ట్ఫేజ్కింద 1,600 (800 మెగావాట్లతో రెండు యూనిట్లు) మెగావాట్ల సూపర్క్రిటికల్ప్లాంట్ను నిర్మించారు. మిగిలిన 2,400 ( 800 మెగావాట్లతో మూడు యూనిట్లు) మెగావాట్ల ప్లాంట్నిర్మాణానికి ఇటీవల పబ్లిక్హియరింగ్నిర్వహించారు. ఫేజ్–1 ప్రాజెక్ట్‌కు ఆనుకుని మాతంగి కాలనీ ఉంది. ఇక్కడ సుమారు 300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్లాంట్‌నుంచి బొగ్గు, దుమ్ము వెలువడుతుండడంతో పాటు శబ్ధ కాలుష్యం విపరీతంగా వస్తోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఫేజ్–2 కింద మరో 2,400 మెగావాట్ల ప్లాంట్ద్వారా వెలువడే కాలుష్యంతో ఇక తట్టుకోలేమని, తమ కాలనీని తరలించాలని పబ్లిక్ హియరింగ్ సందర్భంగా ఎన్టీపీసీ మేనేజ్మెంట్దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదు.
ఎన్టీపీసీ ప్లాంట్పక్కనే ఉన్న మాతంగి కాలనీ ప్రజలు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన పార్లమెంట్లో ప్రశ్నలు లెవనెత్తారు. ఎన్టీపీసీ విస్తరణతో నష్టపోతున్న కాలనీలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరారు. ఆర్అండ్ఆర్ప్యాకేజీని వారికి వర్తింపచేయాలని, స్థానిక నిరుద్యోగులకు ఎన్టీపీసీలో జాబ్ లు కల్పించాలని కోరారు. కాలనీ సమస్యలపై స్పందించని ఎన్టీపీసీ మేనేజ్మెంట్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి మనోహర్లాల్ఖట్టర్తో ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాతంగి కాలనీ వాసుల సమస్యలపై కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు.
కొలువులు రాలే..రోగాలు వస్తున్నయి
ఎన్టీపీసీ కొత్త ప్లాంట్ఏర్పడితే మా పిల్లలకు కొలువులు వస్తాయని ఆశించాం. కానీ ప్లాంట్‌నుంచి వచ్చే కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నాం. ఇప్పటికే మేం పడుతున్న బాధలు పట్టించుకోకపోతే దీక్షలు చేస్తం.
- భద్రయ్య, మాతంగి కాలనీ వాసి-
కాలనీని తరలించి పునరావాసం కల్పించాలి
ఎన్టీపీసీ కాలుష్యం మా కాలనీవాసులకు శాపంగా మారింది. ఇప్పటికే పొగ, దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ కొత్త ప్లాంట్‌లో విద్యుత్‌ఉత్పత్తి ప్రారంభమైతే మేం బతుకుడు కష్టమవుతుంది. మా కాలనీని ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలి. పునరావాసం కల్పించాలి.
- పల్లెర్ల జగన్ గౌడ్, మాతంగి కాలనీ-