వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారు సోమవారం మహాష్టమి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక పూజలు చేశారు. మహాష్టమి అమ్మవారికి ఉదయం భద్రపీఠ సేవ, సాయంత్రం అశ్వ వాహన సేవ నిర్వహించారు.
త్వరలో కొత్త కలెక్టరేట్ ప్రారంభం: మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రూ.53కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను త్వరలోనే ప్రారంభిస్తామని స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నిర్మాణ పనుల్ని మంత్రి పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, మీటింగ్ హాల్, హెలీప్యాడ్ పనులను తనిఖీ చేశారు. జిల్లాలో త్వరలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారని, కొత్త కలెక్టరేట్ తో పాటు మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారని వెల్లడించారు. మెడికల్ కాలేజీకి ఇప్పటికే జాతీయ మెడికల్ కౌన్సిల్ అనుమతి లభించిందని, 150 సీట్లతో కాలేజీ ప్రారంభమవుతుందన్నారు. కొత్త కలెక్టరేట్లో 32 శాఖలు ఉంటాయని, ప్రజలకు సేవలు ఈజీగా అందుతాయన్నారు. జిల్లాకు హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ త్వరలోనే రాబోతోందన్నారు. కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు, కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులున్నారు.
మరిపెడ రూపురేఖలు మారుస్తాం
మరిపెడ, వెలుగు: రాబోయే 10 ఏండ్లలో మరిపెడ రూప రేఖలు మారుస్తామని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎంపీ కవిత అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.4కోట్లతో కట్టిన కూరగాయల మోడల్ మార్కెట్, మరిపెడ శ్మశానవాటిక, బతుకమ్మ ఘాట్‌లు, మరిపెడ ఎస్సీ కాలనీలో ఓపెన్ జిమ్, కొత్త హైమాస్ట్ లైట్స్, జర్నలిస్టులకు 26 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీగా ఉన్న మరిపెడ, మున్సిపాలిటీగా మారిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మౌలిక వసతులు మెరుగుపడ్డాయని, మరిపెడను కేంద్రం ఓడీఎఫ్ గానూ గుర్తించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు, మున్సిపల్ చైర్మన్ గుగులోత్ సింధూర, ఎంపీపీ అరుణ, జడ్పీటీసీ శారద, తహసీల్దార్ రాంప్రసాద్, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో ధన్ సింగ్ తదితరులున్నారు.
తాగునీటికి తండ్లాట
వరంగల్ సిటీ, వెలుగు: బతుకమ్మ వేడుకల్లో సౌకర్యాలు కల్పించడంలో బల్దియా ఆఫీస ర్లు ఫెయిల్ అయ్యారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం రాత్రి వరంగల్ ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదు. వేలాదిగా తరలివచ్చిన మహిళలు, వారి కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసలు మంచినీళ్లు ఎక్కడ ఏర్పాటు చేశారో తెలియక అటూ ఇటూ తిరిగారు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లు సైతం అయిపోవడంతో, దూప తీరక అలమటించారు.
పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటూబైక్ దొంగతనాలు
హనుమకొండ సిటీ, వెలుగు: ఓ వైపు పోలీస్ కావాల ని కోచింగ్ తీసుకుం టూ.. మరోవైపు బైక్ చోరీలకు పాల్పడ్డాడు ఓ యువకుడు. హనుమకొండ సీఐ శ్రీనివాస్ జీ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన డి.చరణ్ తేజ(21) వరంగల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్లలో ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైక్ లు చోరీ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయగా.. సోమవారం హనుమకొండలో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
చేనేత రంగానికి ప్రాధాన్యం
కాజీపేట, వెలుగు: సీఎం కేసీఆర్ చేనేత రంగం, టెక్స్ టైల్ పరిశ్రమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్అన్నారు. సోమవారం రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహా రెడ్డితో కలిసి మడికొండలోని టెక్స్ టైల్ పార్క్ ను సందర్శించారు. పరిశ్రమల్లో వస్త్రాల తయారీ, నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సంక్షేమ పథకాల అమలుతో పాటు టెక్స్ టైల్ రంగ పురోగతికి అనేక సబ్సిడీలు అందిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఛిన్నాభిన్నమైన చేనేత రంగాన్ని.. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేనేతకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారని తెలిపారు.
పీఏసీఎస్ ఘటనలపై విచారణ
శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లా శాయంపేట పీఏసీఎస్ లో ఇటీవల జరిగిన సంఘటనలపై డీసీవో ఆదేశాల మేరకు సోమవారం నోడల్ ఆఫీసర్ విజయభాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. సంఘం చైర్మన్ సిబ్బందిని కులం పేరుతో దూషించారని ఆరోపణలు రావడం, ఒంటెత్తు పోకడలతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు డైరెక్టర్లు చెప్పడంపై ఎంక్వైరీ చేశారు. సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించారు. సొసైటీ డైరెక్టర్లతో మాట్లాడి, వారి వాంగ్మూలం సేకరించారు. నివేదికను తయారు చేసి డీసీఓకు అందజేస్తానని, తదుపరి ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బతుకమ్మ ఆడిన మంత్రులు..
బతుకమ్మ వేడుకల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పాలకుర్తి మండలాల్లో మంత్రి ఎర్రబెల్లి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత పాల్గొని బతుకమ్మ ఆడారు. - వెలుగు నెట్ వర్క్