- ప్రత్యేక పూజలు చేసిన ప్రముఖులు
కాశీబుగ్గ/ నల్లబెల్లి/ ములుగు, వెలుగు: ఉమ్మడి వరంగల్జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం దుర్గామాత బహురూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్భద్రకాళీ ఆలయంలో గాయత్రీ దేవిగా అమ్మవారిని అలంకరించగా, ఐఏఎస్ గిరిజా శంకర్, సీఐఎస్ఎఫ్ అన్నపూర్ణ దంపతులు, డీఐజీ అపరాజిత, ఈవో శేషు భారతి, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నల్లబెల్లి మండలం నారక్కపేటలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమివ్వగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
ములుగు రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గామాత భక్తులకు అన్నపూర్ణాదేవిగా దర్శనమివ్వగా, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సముద్రాల శ్రీనివాసాచార్యులు అమ్మవారికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు భక్తులకు మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, సభ్యులు, రైస్ మిల్లర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కాట్రగడ్డ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.