భద్రకాళి చెరువులో తెప్పోత్సవానికి ఏర్పాట్లు

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు  భద్రకాళి అమ్మవారు మహిషా సురమర్దినిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం చతుస్తుసేవ, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలు  వైభవోపేతంగా నిర్వహించారు.  మధ్యాహ్నం మూడు గంటలకు నవరాత్రి మహోత్సవాల పూర్ణాహుతి చేపట్టారు. బుధవారం ఉదయం అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం,  చక్రస్నానం అనంతరం ధ్వజారోహనం, తెప్పోత్సవం కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఈవో కె.శేషు భారతి వివరించారు. 

భద్రకాళి చెరువులో.. తెప్పోత్సవం
ఏటా దసరా రోజున సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిలో జరిగేలా..బుధవారం భద్రకాళి చెరువులో వైభవంగా తెప్పోత్సవం నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. హంసవాహనంపై  అమ్మవారిని ఊరేగిస్తారు. భద్రకాళి, భద్రేశ్వరులకు జల క్రీడ చేపడతారు. ఇరువురి కల్యాణం, పుష్పయాగంతో నవరాత్రి ఉత్సవాలకు ఆలయ పూజరులు ముగింపు పలకనున్నారు.  మొత్తంగా వరంగల్‍సిటీలో జరిగే దసరా ఉత్సవాల్లో లక్షకుమించి జనాలు వచ్చే అవకాశం ఉంది.