దేవాలయం అంటే.. దేవుడు కొలువై ఉన్న చోటు. కానీ దేవుడు లేని ఓ ఆలయం మన తెలంగాణలో ఉంది. పెద్దపల్లి జిల్లాలో అద్భుతంగా నిర్మించిన ఆ ఆలయంలో ఇంతకీ దేవతా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదు ? అది దేవుడు లేని గుడిగా ఎందుకు మిగిలిపోయింది ? అనే వివరాలను తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాబాద్ గ్రామమది. అక్కడే దేవుడు లేని గుడి కొలువై ఉంది. ఈ గుడి గురించి తెలుసుకోవాలంటే ముందుగా.. ధర్మాబాద్ పక్కనే ఉన్న రాఘవాపురం గ్రామానికి వెళ్లాలి. రాఘవాపురం కేంద్రంగా ఆనాడు సంస్థానాధీశుడిగా వ్యవహరించిన లక్ష్మీకాంతారావు గురించి తెలుసుకోవాలి. గ్రామంలోని రంగనాయక స్వామి ఆలయానికి అనుబంధంగా వందల ఏళ్ల క్రితం.. లక్ష్మీకాంతారావు ఈ గుడిని కట్టించారు. వాస్తవానికి ఈ గుడిలో ఆండాలమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని లక్ష్మీకాంతారావు, ఆయన తండ్రి భావించారు. రంగనాయక స్వామి ఆలయం నుంచి ఆండాలమ్మ తల్లి ఆలయం వరకు రోప్ వే నిర్మిద్దామని భావించారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఇంజనీర్లను కూడా పిలిచారట. అయితే ఇంజనీర్లు రాకపోవడంతో ఆలయంలో ఆండాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన జరగలేదు. అనంతర కాలంలో సంస్థానాధీశుల వారసులు కూడా ఆండాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనపై దృష్టిసారించలేదు. దీంతో ఆ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం దేవుడు లేని ఈ గుడి ఫొటోషూట్ స్పాట్ గా మిగిలిపోయింది. కళాకారుల షూటింగ్ లకు వేదికగా మారింది. స్థానిక సర్పంచ్ చొరవచూపి ఈ ఆలయ ఆవరణను ఒక పార్క్ లా డెవలప్ చేశారు.
ఆలయ గోపురంపై..
ఈ గుడిపై చక్కటి గోపురాన్ని నిర్మించారు. అది తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంది. దానిపై వివాహ వేడుక, పట్టాభిషేక మహోత్సవం వంటి ఘట్టాలకు సంబంధించిన చిత్రాలను జీవకళ ఉట్టిపడేలా చెక్కారు. ప్రధాన గోపురంలో ఆండాలమ్మ అమ్మవారి ప్రతిమ కూడా ఉంది. గర్భ గుడికి ఇరువైపులా దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులతో పాటు అందమైన మండపం కూడా ఉన్నాయి. మండపానికి కొంతదూరంలో విశాలమైన స్వాగత తోరణాన్ని నిర్మించారు.