జన్నారం/కడెం, వెలుగు: కేంద్రంలో బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కమలం పువ్వుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించాలని కోరారు.
ఓటమి భయంతోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని, ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ బాద్యతలు చేపడుతారని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు మండల కేంద్రం లోని వార సంతలో మాజీ ఏంపీ రాథోడ్ రమేశ్, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ వెరబెల్లితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, కిసాన్ మోర్చ, బీజేవైఎం మండల ప్రెసిడెంట్లు మధుసూధన్ రావు, బెడద గోపాల్, ప్రవీణ్ కుమార్, నేతలు దేవేందర్, శంకరయ్య, రమేశ్ గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కడెం మండల కేంద్రంతో పాటు కొత్తమద్దిపడగ, లింగాపూర్ గ్రామాల్లో గోడం నగేశ్ ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందటమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగించిందని, మరోసారి గెలిపించాలని కోరారు. రాష్ట్ర నాయకులు రితేశ్ రాథోడ్, మండల అధ్యక్షుడు కాసావేణి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కళ్లెం రమణారెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు రామగిరి రంజిత్, నాయకులు మనోజ్, రాజేందర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.