హైదరాబాద్ : గోద్రెజ్ క్యాపిటల్ రాబోయే రెండేళ్లలో హోం లోన్ల విభాగంలోకి అడుగుపెడతామని ప్రకటించింది. బడ్జెట్ హోం లోన్లు ఇస్తామని వెల్లడించింది. ప్రస్తుతం తాము ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇస్తున్నామని, తెలుగు రాష్ట్రాల్లో తమ వ్యాపారం విలువ దాదాపు రూ. 500 కోట్లకు చేరుకుందని తెలిపింది. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాలను కంపెనీ అందిస్తోంది. పాడి పరిశ్రమ కోసం క్రీమ్‌లైన్ డెయిరీతో కలిసి డెయిరీ ఫార్మ్ లోన్లను కూడా ప్రవేశపెట్టింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, తయారీ వంటి రంగాలకు ఇకపైనా ప్రాధాన్యత ఇస్తామని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరం చివరికల్లా సప్లై చెయిన్ ఫైనాన్సింగ్‌లోకి కూడా ప్రవేశిస్తామని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 17 వేల కోట్ల బ్యాలెన్స్ షీట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, పుణె మొదలైన 40 నగరాలు, 180 పైచిలుకు ప్రాంతాలలో లోన్లు ఇస్తున్నామని చెప్పారు.