
హైదరాబాద్, వెలుగు: ఫర్నిచర్స్ తయారీ కంపెనీ గోద్రేజ్ ఇంటీరియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లపై ఫోకస్ పెంచింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకో మూడేళ్లలో 25 స్టోర్లను ఓపెన్ చేస్తామని, మొత్తం నెంబర్‌ను 150 కి పెంచుకుంటామని ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం రూ.65–70 కోట్ల రెవెన్యూ వస్తోందని, వచ్చే మార్చి నాటికి ఈ నెంబర్ రూ.100 కోట్లకు చేరుతుందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ సర్కార్ అన్నారు. సౌత్ ఇండియా నుంచి రూ.275 కోట్ల రెవెన్యూ వస్తోందని, త్వరలో రూ.350 కోట్ల రెవెన్యూ సాధిస్తామని వెల్లడించారు.
రెండు తెలుగు రాష్టాల్లో ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టడం పెరిగిందని, తమ కొచ్చే ఆర్డర్లలో 15 శాతం ఆర్డర్లు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని వివరించారు. కంపెనీ కస్టమైజ్డ్ ఇంటీరియర్ డెకరేషన్ సొల్యూషన్స్ అందిస్తోంది. అంతేకాకుండా కప్బోర్డ్లు, సోఫాలు తయారు చేస్తోంది. మై హోమ్, వంశీ రామ్ వంటి డెవలపర్లతో టై అప్ అయ్యి మోడల్ ప్లాట్‌లను కూడా డెవలప్ చేస్తున్నామని దేవ్ అన్నారు. దేశం మొత్తం మీద తమకు ఏడు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లు ఉన్నాయని, కస్టమర్లు కోరితే హ్యాండ్‌మేడ్ ఫర్నిచర్స్‌ను కూడా డెలివరీ చేస్తామని వివరించారు. గోద్రేజ్ ఇంటీరియోకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫర్నిచర్ మార్కెట్‌లో 21 శాతం మార్కెట్ వాటా ఉందని, ఇంకో మూడేళ్లలో 30 శాతానికి చేరుతుందని దేవ్ చెప్పారు.