
- ఊరిలో హనుమంతుడి వెండి కండ్లు మాయం
- ఇటీవల కంటిచూపు కోల్పోయిన ఇద్దరు ఆదివాసులు
- దేవుడి కండ్లు పోవడం వల్లే అని ప్రచారం
గుడిహత్నూర్, వెలుగు: ఆ ఊరి హనుమంతుడికి ఉన్న వెండికండ్లు మాయమయ్యాయి. ఇది జరిగిన కొద్దిరోజులకు ఇద్దరు ఆదివాసులు చూపు కోల్పోయారు. దేవుడి కండ్లను ఎత్తుకపోవడం వల్లే ఊరికి అరిష్టం వచ్చిందనే ప్రచారం మొదలైంది. ఇది కాస్తా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసేదాకా వెళ్లింది. ఎమ్మెల్యేనే వెండికండ్లను తీసుకెళ్లారని, వాటిని తెచ్చివ్వాలని ఆదివాసులు గురువారం డిమాండ్ చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం..జులై 10న ఎమ్మెల్యే రేఖానాయక్ ఆదివాసీ గ్రామం డోంగర్గావ్లో పర్యటించారు. పొలిమేరలోని హనుమాన్ విగ్రహాన్ని సందర్శించారు. కోరిన కోరికలు నెరవేరితే భక్తులు హనుమంతుడికి వెండి కండ్లు సమర్పిస్తుంటారు.
అయితే, తన కోరిక నెరవేరితే బంగారు కండ్లు చేయిస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్ మొక్కుకొని విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. ఈలోగా హనుమంతుడికి ఉన్న వెండికండ్లలో రెండు కండ్లు కనిపించకుండా పోయాయి. పది రోజుల క్రితం గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావ్ చూపు కోల్పోయాడు. ఈయన కొద్దిరోజులుగా దవాఖానల చుట్టూ తిరుగుతున్నాడు. బుధవారం రాత్రి ఉన్నట్టుండి గ్రామ పటేల్ పెందోర్ బాదుపటేల్ చూపు కూడా పోయింది. దీంతో ఆదివాసులు భయపడుతున్నారు. ఎమ్మెల్యే వెండి కండ్లు ఇస్తే బంగారు కండ్లు చేయిస్తానని చెప్పారని, ఓ నేత కండ్లు తీసివ్వగా తీసుకపోయారని కొందరు గ్రామస్తులు, కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. కాగా, బాధితులిద్దరూ అనారోగ్యంతో, కండ్ల ఇన్ఫెక్షన్తో బాధపడ్తున్నారని, ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిసింది.
నిందలు మోపుతున్నరు
గ్రామానికి వెళ్లినప్పుడు పొలిమేరలోని హనుమంతుడికి బంగారు కండ్లు పెట్టిస్తానని మొక్కుకున్నా. కానీ, వెండి కండ్లు తీసుకుపోలే. ఎలక్షన్లు వస్తున్నాయనే కాంగ్రెస్ నాయకులు దేవుడిపేరుతో రాజకీయం చేస్తున్నారు. - ఎమెల్యే రేఖానాయక్