ఆధ్యాత్మికం: జీవితమే ఓ పరీక్ష..శ్రీరాముడు... శ్రీకృష్ణుడు కూడా రాశారు..

ఆధ్యాత్మికం:  జీవితమే ఓ పరీక్ష..శ్రీరాముడు... శ్రీకృష్ణుడు కూడా  రాశారు..

ప్రతి మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఎప్పుడూ పరీక్షలను ఎదుర్కొంటూనే ఉంటాడు.    బాల్యంలో స్కూల్లో పరీక్షలు.. ఒక వయస్సు వచ్చే సరికి ఉద్యోగ పరీక్షలు.. తరువాత సంసారంలో ఉండే ఎగ్జామ్స్​ అన్నీ ఇన్నీ కావు.. ఇక వృద్దాప్యంలో కూడా ఆరోగ్య పరిక్షల్లో పాస్​ అవ్వాలి కదా..  మనుషులకే కాదు.. దేవుళ్లకు కూడా పరీక్షలుంటాయి.  మనం భగవంతుడిగా ఆరాధించే.. శ్రీరామ చంద్రుడు.. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అనేక పరీక్షలను ఎదుర్కొన్నారని పురాణాలు చెబుతున్నాయి. 

 హైటెక్​ యుగంలో జనాలు జీవితం గురించి చాలా ఆందోళన పడుతుంటారు. జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. కాలం పెట్టే ప్రతి పరీక్షలో పాస్ అవ్వాల్సిందే.. లేదంటే.. ఆ విషయంలో చికాకులుఏర్పడి.. జీవితంపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు.    జీవితమే మనకొక పరీక్ష అని తెలిసేసరికి డీలాపడిపోతాం.  ఫలితాలు తెలియకపోతే మన గుణగణాలు ఎలా తెలుస్తాయి? అందుకే పరీక్షకు సిద్ధపడటంలోనే మనిషి గొప్పదనం ఉంది. బంగారానికి కూడా అగ్నిపరీక్ష ఉంటుంది. వజ్రానికి కోత పరీక్ష ఉంటుంది. 

మనిషికే కాదు, భగవంతుడికీ పరీక్షలు ఉంటాయి. దైవాన్ని నమ్మని మనిషే భగవంతుడికి ఒక పెద్ద పరీక్ష! అతడిని తన వైపు తిప్పుకోవడానికి ఎన్నో హృదయానుభవాలు కలిగిస్తాడు. నమ్మని మనిషి, అవన్నీ కాకతాళీయంగా జరిగాయని కొట్టిపారవేస్తుంటాడు. నమ్మినవాడి గురించి దైవం పట్టించుకోకపోయినా ఫరవాలేదు. నమ్మని వాడితోనే పెద్ద చిక్కు.ఒక్కోసారి దేవుడే మనిషి రూపంలో దిగివచ్చి, కొంతమంది మనుషులను మార్చిన ఉదంతాలు వినిపిస్తుంటాయి. ఇంతకు మించి దైవానికి పరీక్ష ఏముంది?    

పరీక్షలు  దేవుళ్లను కూడా నలిపేశాయని పండితులు చెబుతున్నారు.  ధర్మరాజు ... కౌరవులతో పోటీ పడి జూదం  ఆడాడు....  ఓడాడు. అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి సిద్ధపడ్డారు. పాండవులు... ఎన్నో కష్టాలు, బాధలు. అదంతా ఒక పరీక్షగా తీసుకున్నారు. శ్రీకృష్ణుడి సహాయంతో గట్టెక్కారు. కుంతీదేవి ఎన్నో కష్టాలు అనుభవించింది. శ్రీరామచంద్రునికి పినతల్లి కూడా పరీక్ష పెట్టడం వల్లే అడవుల్లో గడపాల్సిన పరిస్థితులు దాపురించాయి.  ఇక శ్రీకృష్ణుడు ఎదుర్కొన్న పరీక్షలు అన్నీ ఇన్నీ కావు.  పసితనంలో ఆయన ఎదుర్కొన్న హత్యా ప్రయత్నాలు లెక్కలేవు... తన మేమే అతనిని చంపేందుకు కుట్ర పన్నాడు.  అలా జరిగిన ప్రతి పరీక్షలో నెగ్గి ...  తనను తాను రక్షించుకోవడమే కాకుండా.... లోక రక్షకుడిగా ఉండేందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు  ఎన్నో పరీక్షల్లో పాస్​ అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. 

 పక్షికి ...తుపాను పరీక్ష పెడుతుంది.  గద్ద పెట్టే  పరీక్షలోపాము పాస్​ అయితే బతుకుతుంది.  ఇక మానవులు .. నన్ను పరీక్షించకు దేవా... నీ పరీక్షలకు తట్టుకోలేను...’ అని భక్తులు భగవంతుడికి మొరపెట్టుకుంటూ ఉంటారు. తడిగుడ్డ పిండినట్లు మనుషులను పరీక్షలు పిండేస్తాయి. కొందరు తట్టుకోగలుగుతారు. కొందరు తట్టుకోలేరు. పరీక్షాకాలంలో మనకు సరైన మార్గదర్శకత్వం ఉండాలి. అవగాహన చేసుకోగలిగే మంచి మేధస్సు ఉండాలి. ఓర్చుకోగలిగే హృదయం ఉండాలి.  

పరీక్షాకాలంలో భగవంతుడు మనిషికి తప్పక సహాయం చేస్తాడు. అదేమిటి ....పరీక్షలు భగవంతుడే కదా పెడతాడు. మళ్లీ ఆయనే రక్షిస్తాడా అని సందేహం కలుగుతుంది. నిజానికి, దేవుడు పరీక్షలు పెట్టడు. మనం చేసిన మంచో, చెడో మన ముందుకు వచ్చి పరీక్షల రూపంలో నిలబడతాయి. వాటిని అనుభవించి తీరాలి. ఆ బరువులు మొయ్యడానికి తట్టుకోలేక గోలపెడుతుంటే దైవం సహాయం చేస్తాడు.

జీవితంలో ..ప్రతి ఒక్కరూ  మరిన్ని కష్టాల పరీక్షలు రాయాల్సి ఉంటుంది.  ఈ పరీక్షల్లో నెగ్గాలంటే  దైవాన్ని నిరంతరం వేడుకుంటూ దగ్గరగా ఉండాలి.  కష్టాలు రాకుండా ఉండవు. పరీక్షలు లేకుండా ఉండవు. సహాయం చేసే చెయ్యి మన వెనక ఉందన్న ధీమా నిలబెడుతుంది.... గెలిపిస్తుంది. జీవితం ఒక పరీక్ష అని తేలిపోతే చాలా సుఖంగా ఉంటుంది. దాన్ని విజయవంతంగా ఎదుర్కోవడానికి అన్ని శక్తియుక్తులతో మనిషి ఒక కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. ఆట ఆడాలి. ఆడుతూ ఎన్నో అవరోధాలు, అడ్డంకులు దాటుతూ విజయ పరీక్షకు నిలబడాలి.

మానవులు జ్ఞానం పొందాలంటే అడుగడుగునా పరీక్షలకు సిద్ధపడాలి. బతుకులో ఈ పరీక్షల తాకిడి ఏమిటని చాలామంది బాధపడతారు. పరీక్ష లేకుండా ఉత్తీర్ణత సాధించాలనుకుంటారు. చిన్న చిన్న పరీక్షలు రాస్తూ ఒక్కసారిగా పెద్ద పరీక్ష రాస్తాం. విజయం సాధించినప్పుడు మన కళ్లలో సంతోషం, హృదయంలో ఆనందం వద్దన్నా కలుగుతాయి. మళ్లీ మళ్లీ విజయాలు సాధించడానికి పరీక్షలు ఎదుర్కోవాలి.