గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికకు తొలి బోనం

గోల్కొండ ఖిల్లాలోని జగదాంబికకు తొలి బోనం
  •      జులై 7న షురూకానున్న బోనాల ఉత్సవాలు
  •      కోటలోని అమ్మవారికి 9 రోజులు.. 9 పూజలు 
  •     నెలరోజులు కొనసాగనున్న భక్తుల సందడి
  •     పచ్చికుండతో తొలిబోనం సమర్పించనున్న 28 కుల వృత్తుల వారు

హైదరాబాద్, వెలుగు : భాగ్యనగరంలో ఎంతో ఘనంగా జరుపుకునే ఆషాఢ మాస బోనాలు ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. జులై 7 నుంచి ఆగష్టు 4 వరకు కొనసాగనున్నాయి. 28 కుల వృత్తులకు చెందినవారు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించాక ఉత్సవాలు ఊపందుకోనున్నాయి. సిటీలోని ప్రధాన ఆలయాలతో పోలిస్తే గోల్కొండలో సంబురాలు భిన్నంగా జరుగుతాయి. అన్ని గుళ్లలో ఒకరోజు బోనాలు, తర్వాతి రోజు రంగం కార్యక్రమం ఉంటుంది. గోల్కొండ కోటలోని అమ్మవారికి నెలరోజులపాటు ప్రత్యేక పూజలు జరుగుతాయి.

నాలుగు వారాలపాటు భక్తులు బోనాలతో కోటకు తరలివస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఆది, గురువారాల్లో బోనాలతో తరలివచ్చే భక్తులతో కోట కిటకిటలాడుతుంది. చివరిగా రంగం కార్యక్రమం ఉంటుంది. నెల రోజులపాటు భక్తులను ఉచితంగా కోటలోకి అనుమతిస్తారు. కోటను అందంగా ముస్తాబు చేస్తారు. అమావాస్య రోజున(ఈసారి జులై 5న)  మహిళలు కోటలోని 400 మొట్లకు పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి అలంకరిస్తారు. తర్వాత రెండు రోజులకు ఉత్సవాలు మొదలవుతాయి. ఏటా గోల్కొండకు బోనాలతో వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది.

గతేడాది ఆషాఢ మాసంలో దాదాపు 8 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని, తగిన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వహకులు చెబుతున్నారు. తానీషా రాజుల కాలంలో గోల్కొండ బోనాలు ప్రారంభం అయ్యాయని,  మొదట్లో గోల్కొండ బోనాలను సర్కారీ బోనాలుగా  పిలిచేవారని, కాలక్రమేనా గోల్కొండ బోనాలుగా పిలుస్తున్నారని చరిత్రాకారులు చెబుతున్నారు. 

పచ్చికుండతో తొలి బోనం

గోల్కొండ కోటపై కొలువై ఉన్న జగదాంబికకు మొదటి బోనాన్ని పచ్చి కుండతో సమర్పిస్తారు భక్తులు. 28 కుల వృత్తుల ఆధ్వర్యంలో అమ్మవార్లకు  రెండు పచ్చి కుండల్లో నజర్​బోనాలను చేసి,  ఒకటి జగదాంబిక(ఎల్లమ్మ)కు, మరొకటి మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. బోనం కుండకు ఎలాంటి డెకరేషన్​లేకుండా.. పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. బడా జజార్ నుంచి జగదాంబిక అమ్మవారి ఊరేగింపు, రిసాల బజార్ నుంచి మహంకాళి అమ్మవారి ఊరేగింపు ప్రారంభమవుతాయి. అలాగే లంగర్​హౌజ్​చౌరస్తాలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 30 అడుగుల తొట్టెలతో పోతరాజులు, శివసత్తులు, కళాకారుల ఆటపాటలతో అమ్మవార్లను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకొస్తారు.

ఆ రెండు రోజులు స్పెషల్​

అమ్మవార్లు ప్రతి ఆదివారం, గురువారం భక్తుల నుంచి తొమ్మిది రకాల పూజలు అందుకుంటారు. మొదటిరోజైన జులై 7న(ఆదివారం) పంచామృతాలతో పూజా కార్యక్రమం, జులై 11న(గురువారం) అమ్మవార్లకు ఒడి బియ్యం, బోనాల సమర్పణ, హోమం కార్యక్రమం ఉంటాయి. జులై 14న(ఆదివారం) ఓల్డ్ సిటీలోని పలు బస్తీల నుంచి 25 తొట్టెలు తీసుకొచ్చి అమ్మవార్లకు సమర్పిస్తారు. జులై 18న(గురువారం) అమ్మవారిని పూలతో, గాజులతో అలంకరించి నవ ధాన్యాలతో పూజ కార్యక్రమం

జులై 21న(ఆదివారం) శాఖాంబరి పూజ, జులై 25న (గురువారం) అమ్మవార్లకు కల్లు, శాఖ, గుమ్మడికాయల సమర్పణ, జులై 28న(ఆదివారం) అమ్మవార్లకు శావా కార్యక్రమం, ఆగష్టు 1న (గురువారం) 28  కుల వృత్తులకు చెందిన వారి ఆధ్వర్యంలో శాంతి పూజలు, కల్లు శాఖ సమర్పణ, చివరగా తొమ్మిదో పూజ ఆగష్టు4న(ఆదివారం) నవ ధాన్యాలతో చేసిన ఐదంస్తుల బోనంతో దేవదాసి కుంభహారతి కార్యక్రమం ఉంటుంది.